epaper
Sunday, February 22, 2026
epaper

పైసల మంత్రికి మరో క్యాంప్ ఆఫీస్‌.. ఏకంగా నాలుగున్నర కోట్లు..

కలం, తెలంగాణ బ్యూరో : ‘వడ్డించేవాడు మనవాడైతే.. ఏ బంతిలో కూర్చుంటే ఏమి?’.. అనేది తెలుగు నానుడి. దీన్ని అక్షరాలా రుజువు చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!(Bhatti Vikramarka) ఎలాగూ ఆర్థిక శాఖ మంత్రి కూడా ఆయనే కావడంతో ఆయనకు ఆయనే నిధులు వడ్డించేసుకున్నారు. ఎమ్మెల్యేగా భట్టికి మధిరలో ‘ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్’ ఉన్నప్పటికీ.. ఖమ్మం టౌన్‌లో మరో క్యాంప్ ఆఫీస్‌ నిర్మాణానికి నాలుగున్నర కోట్ల రూపాయలు మంజూరు చేయించుకున్నారు. రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజినీర్ సిఫారసులను పరిశీలించిన ఆ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులూ జారీ చేసేశారు. ఆర్థిక శాఖ.. అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ కూడా శాంక్షన్ చేసేసింది. గత నెల 7వ తేదీనే ఇదంతా జరిగిపోయింది.

మధిరలో క్యాంప్ ఆఫీస్ ఉన్నప్పటికీ.. :

ఎమ్మెల్యేలకు వారి సొంత నియోజకవర్గంలో ఆఫీస్ కమ్ అఫీషియల్ రెసిడెన్స్ అవసరాల కోసం గత ప్రభుత్వమే క్యాంప్ ఆఫీసులను నిర్మించింది. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోని 104 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవి నిర్మాణమయ్యాయి. ఒక్కో క్యాంప్ ఆఫీస్‌కు సగటున కోటి రూపాయల చొప్పున మొత్తం 104 నియోజకవర్గాల్లో రూ.119 కోట్లను అప్పటి ప్రభుత్వం ఖర్చు చేసింది. కొన్ని చోట్ల కోటి రూపాయలకంటే ఎక్కువ ఖర్చయింది. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు రూ. 1.90 కోట్లు ఖర్చయింది. ఇలా కొన్ని చోట్ల కోటి రూపాయలకంటే ఎక్కువ ఖర్చు కావడంతో మొత్తం వ్యయం రూ.119 కోట్లకు పెరిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో సైతం క్యాంప్ ఆఫీస్ నిర్మాణమైంది.

ఖమ్మం టౌన్‌లో క్యాంప్ ఆఫీసా? :

డిప్యూటీ సీఎంగా, ఆర్థిక శాఖ మంత్రిగా హైదరాబాద్ నగరంలో ప్రజాభవన్‌ను అధికారిక బంగళాగా భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) వాడుకుంటూ ఉన్నారు. గతంలో ఇదే భవనంలో సీఎం హోదాలో కేసీఆర్ వాడుకున్నారు. మధిరలో ఎలాగూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉన్నది. ఇప్పుడు ఈ రెండూ కాదని ఖమ్మం పట్టణంలో మరో క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి నిధులు విడుదల కావడమే చర్చనీయాంశం. క్యాంప్ కార్యాలయాలకు గత ప్రభుత్వం కోటి రూపాయలను కేటాయిస్తే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఖమ్మం పట్టణంలోని క్యాంప్ ఆఫీస్‌కు మాత్రం నాలుగున్నర కోట్లు కేటాయించడం విమర్శలకు దారితీసింది. ఆయన నియోజకవర్గం మధిర అయినప్పుడు ఖమ్మం టౌన్‌లో క్యాంప్ ఆఫీస్‌ అవసరమేంటన్నది సచివాలయ కారిడార్లలో వినిపిస్తున్న మాట.

ఉద్యోగుల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్​కు పైసల్లేవ్.. :

సంవత్సరాల తరబడి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత వారికి హక్కుగా లభించే గ్రాట్యుటీ, జనరల్ ఇన్సూరెన్స్, బెనిఫిట్స్ లాంటివాటికి ప్రభుత్వం నుంచి పేమెంట్స్ లేవన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే గత నెలలో ఉద్యోగ సంఘాల క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా వివరణ ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటున్నప్పటికీ ఆర్థిక సమస్యల కారణంగా ఇవ్వలేకపోతున్నామన్నారు. ఇలాంటి సమయంలో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసు నిర్మాణానికి నాలుగున్నర కోట్లు విడుదల కావడం చర్చకు తావిచ్చినట్లయింది. రిటైర్డ్​ ఉద్యోగుల బెనిఫిట్స్​తో పోలిస్తే నాలుగున్నర కోట్లు తక్కువే కావచ్చుగానీ ప్రజాధనం దుర్వినియోగమేననే మాటలు వినిపిస్తున్నాయి.

వరుస వివాదాల్లో డిప్యూటీ సీఎం భట్టి :

సింగరేణికి చెందిన నైని కోల్ బ్లాక్ టెండర్ల వివాదంలో చిక్కుకున్న డిప్యూటీ సీఎం ఇప్పుడు మరో వివాదాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో పడ్డారు. ఇటీవలే మంత్రుల నివాసాల్లో బాత్‌రూమ్‌ల రిపేర్ పనులు, ఫర్నీచర్ కొనుగోళ్ళు.. ఇలాంటి అవసరాలకు లక్షలు, కోట్ల రూపాయల్లో ఖర్చు చేస్తున్న ప్రభుత్వం డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసుకు నాలుగున్నర కోట్లు మంజూరు చేయడాన్ని ప్రభుత్వ ఉద్యోగులే జీర్ణించుకోలేకపోతున్నారు. అటు నియోజకవర్గంలో ఒక క్యాంప్ ఆఫీస్​ ఉండనే ఉన్నది.. ఇటు హైదరాబాద్‌లో ప్యాలెస్‌ను తలపించే ప్రజాభవన్ కూడా ఉన్నది.. ఇక మధ్యలో ఖమ్మం టౌన్‌లో కొత్తగా క్యాంప్ ఆఫీస్ డిమాండ్ ఏంటి.. ఖమ్మం టౌన్‌తో డిప్యూటీ సీఎంకు అఫీషియల్‌గా ఏం సంబంధం?.. భట్టి విక్రమార్క తరహాలోనే మరో మంత్రి కూడా జిల్లా హెడ్ క్వార్టర్‌లో క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి రిక్వెస్టు పెడితే ప్రభుత్వం ఓకే చెప్తుందా?.. ఇవీ ఇప్పుడు సచివాలయ కారిడార్లలో ఉద్యోగుల మధ్య వినిపించే గుసగుసలు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>