కలం, స్పోర్ట్స్ : ప్రస్తుతం భారత జట్టులో వరుణ్ చక్రవర్తి.. బుమ్రా కంటే ప్రమాదకర బౌలర్‌గా మారాడని మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ (Kris Srikkanth) అభిప్రాయపడ్డారు. టీ20 ఫార్మాట్‌లో వరుణ్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ, అతనికి తగిన గుర్తింపు రావడం లేదని ఆయన పేర్కొన్నారు. టీ20 వరల్డ్ కప్‌లో వరుణ్ చక్రవర్తి అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తీసి 6.88 సగటు, 5.16 ఎకానమీ రేట్‌తో ప్రభావం చూపించాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో మూడు ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి కీలకంగా మారాడు. వరుణ్, బుమ్రా కలిసి ఆడిన 21 మ్యాచ్‌ల్లో వరుణ్ 30 వికెట్లు సాధించగా, బుమ్రా 22 వికెట్లు తీసుకున్నాడు. బ్యాటర్లు వరుణ్ బౌలింగ్‌ను అంచనా వేయలేక ఇబ్బంది పడుతున్నారని శ్రీకాంత్ (Kris Srikkanth) వివరించారు.
అతని గూగ్లీలు, వేగం మార్పులు, లైన్-లెంగ్త్ వల్ల బ్యాటర్లకు ఎదుర్కోవడం కష్టమవుతోందని చెప్పారు. వరుణ్‌కు తగిన గుర్తింపు రావడం లేదని, అతను స్థిరంగా మ్యాచ్‌లపై ప్రభావం చూపుతున్నాడని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. భారత్ వరల్డ్‌కప్ గెలిస్తే వరుణ్ టోర్నమెంట్ ప్లేయర్ అయ్యే అవకాశముందని ఆయన భావించారు.ఇక ఈ టోర్నమెంట్‌లో బుమ్రా మూడు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీసి 13.50 సగటుతో కొనసాగుతున్నాడు. సూపర్-8 దశలో భారత్ విజయానికి వరుణ్, బుమ్రా ఇద్దరూ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. రాబోయే మ్యాచ్‌ల్లో భారత బౌలింగ్ దళం ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది.


