కలం, వెబ్ డెస్క్ : బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (Bengaluru Airport)లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు ఒక భారీ స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు. బ్రెజిల్ దేశానికి చెందిన ఒక వ్యక్తి సుమారు 4.77 కిలోల కొకైన్‌ను తరలిస్తూ పట్టుబడ్డాడు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ దాదాపు రూ. 23.88 కోట్లు ఉంటుందని అంచనా.
సౌ పౌలో నుండి దోహా మీదుగా బెంగళూరు చేరుకున్న ఈ ప్రయాణీకుడిపై నిఘా ఉంచిన అధికారులు, అతడి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పట్టుబడకుండా ఉండటం కోసం నిందితుడు నాలుగు హ్యాండ్‌బ్యాగులను ప్రత్యేకంగా మార్పు చేసి, వాటి లోపల రహస్య అరలను ఏర్పాటు చేశాడు. కేవలం పొడి రూపంలోనే కాకుండా, కొకైన్ ద్రావణంతో తడిపిన వస్త్రాలను కూడా ఆ హ్యాండ్‌బ్యాగుల లోపల దాచి తరలించే ప్రయత్నం చేశాడు.
ఈ భారీ డ్రగ్స్ పట్టుబడటంతో అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎన్డిపిఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు, ఈ మాదకద్రవ్యాలను ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.


