epaper
Sunday, February 22, 2026
epaper

నల్లగొండలో 41వేల ఎకరాలకు పడిపోయిన సాగు.. కలెక్టర్ కీలక సమావేశం

కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) జిల్లాలో ఒకప్పుడు బత్తాయి సాగుకు మంచి పేరు ఉండేదని, కానీ ఇప్పడు 41వేల ఎకరాలకు బత్తాయి సాగు (Sweet Lime Cultivation) పడిపోయిందని కలెక్టర్ చంద్రశేఖర్ (Collector Chandrashekar) తెలిపారు. గురువారం జిల్లాలోని కొండమల్లేపల్లిలో ఉద్యాన పరిశోధన కేంద్రంలో బత్తాయి రైతులతో నాబార్డు సహకారంతో రైతు ఉత్పాదక సంస్థలపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్​ బత్తాయి రైతులనుద్దేశించి మాట్లాడారు. బత్తాయి సాగుతో అధిక లాభాలు ఆర్జించేందుకు మెలకువలు, మార్కెటింగ్ విధివిధానాలు, అధ్యయనాలు క్షేత్రస్థాయి సందర్శనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా బత్తాయి రైతులు భూసార పరీక్షలను చేయించుకోవాలని సూచించారు. బత్తాయి రైతులు రైతు ఉత్పాదక సంస్థలు ఏర్పాటు చేసుకొని, వాటిని సమర్థవంతంగా నిర్వహించుకోవాలని వెల్లడించారు. మండలాల రైతులు సంఘటితంగా ముందుకొస్తే ఎఫ్‌పి‌ఓ ఏర్పాటుకు నాబార్డు పరిశీలిస్తుందన్నారు.

2011లో లక్షకు పైగా ఎకరాల్లో సాగు: వీసీ రాజిరెడ్డి

2011 సంవత్సరంలో లక్షకుపైగా ఎకరాల్లో బత్తాయి పంటలు సాగయ్యాయని (Sweet Lime Cultivation) కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ రాజిరెడ్డి తెలిపారు. మార్కెట్ సమస్యలు, దళారీల బెడద, తదితర కారణాలవల్ల బత్తాయి రైతులు (Farmers) ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయితే మార్కెట్ సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఉద్యాన పరిశోధనలో భాగంగా భవిష్యత్తులో బత్తాయికి ఎదురయ్యే సమస్యలపై కూడా సైంటిస్టులు దృష్టి సారించాలని, బత్తాయిలో ఉత్తమ నిర్వహణ ఫలితాలపై రైతులకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు.

పంట అమ్ముకోవడంలో ఇబ్బందులు: యాస్మిన్ భాష

బత్తాయి రైతులకు సరైన మొక్కల లేకపోవడం, ఎరువులు వాడకపోవడం, పంట అమ్మకాల్లో ఇబ్బందులు పడుతున్నట్టు రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ భాష తెలిపారు. రైతులు సంఘటితంగా రైతు ఉత్పత్తి సంస్థగా ఏర్పడితే దానికి లైసెన్స్ వస్తుందన్నారు. రైతులు విధిగా సేంద్రియ వ్యవసాయం, జీవ ఎరువులను వినియోగించాలని సూచించారు. జిల్లాలో బత్తాయి తోటలను పరిశీలించి రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసే విషయం ఆలోచిస్తామన్నారు. అలాగే అభ్యుదయ రైతులను గుర్తించి ఇతర రైతులకు శిక్షణ ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

రాష్ట్రంలో ఎంఐడీహెచ్ పథకం కింద రెండు సంవత్సరాల నుండి ఉద్యాన రైతులకు సహకారం అందిస్తున్నామని, ఈ సంవత్సరం రూ.145 కోట్ల ఖర్చు చేయనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్గానిక్ ఫర్టిలైజింగ్ సర్టిఫికేషన్ డైరెక్టర్ కిరణ్ కుమార్, నాబార్డు సీజీఎం గణపతి, ప్రొఫెసర్ ఆరీఫ్ ఖాన్, నాబార్డు డీడీఎం వినయ్ కుమార్, ఉద్యాన శాఖ శాస్త్రవేత్తలు రాజా గౌడ్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుభాషిణి, ఉద్యాన శాఖ అధికారులు, బత్తాయి రైతులు గుర్రం శ్రీనివాస్ రెడ్డి, పద్మా రెడ్డి, వాసుదేవా రెడ్డి పాల్గొన్నారు.

Read Also: సిద్దిపేట వేదికగా కవిత సంచలన సవాల్..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>