కలం, వెబ్ డెస్క్ : వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తాను సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) కీలక ప్రకటన చేశారు. ఈ కొత్త పార్టీకి సంబంధించిన విధివిధానాలు సిద్ధమయ్యాయని, మే మొదటి వారంలో పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తానని ఆమె వెల్లడించారు. పార్టీ పేరులో తెలంగాణ అనే పదం ఉంటుందని ఆమె తెలిపారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంలో పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు సమాచారం.
పోటీ ఎక్కడి నుంచంటే?
వచ్చే ఎన్నికల్లో తాను ఖచ్చితంగా పోటీ చేస్తానని కవిత పేర్కొన్నారు. తన మొదటి ప్రాధాన్యత సిద్దిపేట (Siddipet) అని, ఒకవేళ కుదరకపోతే రెండో ఎంపికగా బోధన్ (Bodhan) నుంచి బరిలోకి దిగుతానని ఆమె తెలిపారు. అయితే ఎన్నికల వ్యూహంలో భాగంగా రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాబోయే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ ఉండదని, తమ పార్టీయే ప్రధాన ప్రతిపక్షంగా అవతరిస్తుందని తెలిపారు. ఒకప్పుడు మంత్రులు ఎర్రవెల్లికి పోయేవారని, ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా క్షేత్రంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తాము పక్కా అధికారంలోకి వస్తామని కవిత (Kavitha) తెలిపారు.
Read Also: తొర్రూరు మున్సిపాలిటీ లక్కీ డ్రాలో మోసం.. బీఆర్ఎస్ సంచలన ఆరోపణ!
Follow Us On: Instagram


