కలం, వెబ్ డెస్క్: బాలికపై లైంగిక దాడి కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పుపై, ఆ సందర్భంగా సదరు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కేసులో నిందితులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
వివరాలివీ..
ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్లో (Kasganj Case) 2021 నవంబర్‌లో ఓ మహిళ తన కుమార్తె(11)తో కలసి బంధువుల ఇంటి నుంచి సొంతూరికి బయల్దేరింది. మార్గమధ్యలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పవన్, ఆకాశ్ బైక్‌పై వాళ్లకు ఎదురయ్యారు. బాలికను ఇంటి దగ్గర దింపుతామని బండిపై ఎక్కించుకున్నారు. కొంతదూరం వెళ్లిన తర్వాత బైక్‌ను ఆపి, అమ్మాయిని సమీపంలోని కల్వర్టు కిందకు లాక్కు వెళ్లేందుకు ప్రయత్నించారు. బాలిక దుస్తులను తొలగించేందుకు ప్రయత్నిస్తూ పైజామా దారాలను తెంచేశారు. ఎదపై చేయి వేసి అసభ్యంగా తాకారు. బాలిక కేకలు వేయడంతో సమీపంలో ఉన్న కొంతమంది అక్కడకు వచ్చారు. దీంతో ఆ యువకులు పారిపోయారు.
దీనిపై లైంగిక దాడి, పోక్సో కేసు నమోదైంది. అనంతరం అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జడ్జి ఒకరు మాట్లాడుతూ దుస్తులు లాగడం, పైజామా దారాలు తెంచేయడం, వక్షోజాలను తాకడం అత్యాచారయత్నం లేదా అత్యాచారంగా పరిగణించలేమంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, కేసు కొట్టేశారు.
దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం(Supreme Court) సుమోటోగా తీసుకొని గతేడాది ఒకసారి విచారణ జరిపింది. అలహాబాద్ హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు సమర్థనీయం కాదని, అవి అమానవీయమని అప్పట్లో వ్యాఖ్యానించింది. ఆ తీర్పుపై స్టే విధిస్తూ, కేంద్రం, యూపీ గవర్నమెంట్‌కు నోటీసులు కూడా ఇచ్చింది.
ఈ క్రమంలో బుధవారం మరో దఫా కేసును సుప్రీం విచారించింది. బాలిక దుస్తులను తొలగించేందుకు ప్రయత్నించడం, పైజామా దారాలను తెంచేయడం, ఎదను అసభ్యంగా తాకడం అత్యాచారయత్నమేనని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇలాంటి కేసుల్లో అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలని భోపాల్‌లోని నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ(ఎన్‌జేఏ)ని కోరింది. ఓ కమిటీని వేసి గైడ్‌లైన్స్ రూపొందించి, మూడు నెలల్లోగా అందజేయాలని సూచించింది.
Read Also: వివాదాల ‘ఇంపాక్ట్’.. ఏఐ సమ్మిట్‌లో రోబో డాగ్ రభస
Follow Us On: X(Twitter)


