కలం, వెబ్ డెస్క్: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ బ్లింకిట్‌పై ఢిల్లీలో కేసు నమోదైంది. ఆన్లైన్లో నిబంధనలకు విరుద్ధంగా ఫోల్డింగ్ చాకులను విక్రయించినట్టు ఫిర్యాదులు అందినట్టు సమాచారం. ఢిల్లీలో ఇటీవల చోటుచేసుకున్న రెండు వేర్వేరు హత్య కేసుల దర్యాప్తులో ఈ సమాచారం బయటపడటంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఢిల్లీలో జరిగిన రెండు హత్యలలో నిందితులు ఉపయోగించిన కత్తులను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ఆ ఆయుధాలు బ్లింకిట్ ప్లాట్‌ఫామ్ (Blinkit) ద్వారా ఆర్డర్ చేసినవేనని పోలీసులు గుర్తించారు. దీంతో ఆన్లైన్ విక్రయాలపై అమల్లో ఉన్న నిబంధనలను ఉల్లంఘించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చట్టం ఏం చెబుతోంది?
ప్రస్తుత చట్టాల ప్రకారం, పరిమిత పరిమాణంలో ఉన్న ఫోల్డింగ్ పాకెట్ చాకులకు మాత్రమే ఆన్లైన్ విక్రయాలకు అనుమతి ఉంటుంది. బ్లేడ్ పొడవు గరిష్టంగా 7.62 సెంటీమీటర్లు, వెడల్పు 1.72 సెంటీమీటర్లలోపు ఉండాలి. హత్య కేసుల్లో ఉపయోగించిన చాకులు ఈ పరిమితులను మించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటి బ్లేడ్ పొడవు సుమారు 8 సెంటీమీటర్లు కాగా వెడల్పు 2.5 సెంటీమీటర్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయుధాల విక్రయంపై చట్టపరమైన ఉల్లంఘనలు జరిగాయని భావించి కేసు నమోదు చేశారు.
ఈ-కామర్స్ సంస్థలపై పర్యవేక్షణ
ఈ ఘటనతో ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రమాదకర వస్తువుల విక్రయాలపై మరోసారి చర్చ మొదలైంది. విక్రయించే వస్తువులు చట్టబద్ధమైనవేనా, వినియోగదారుల ధృవీకరణ సరైన విధంగా జరుగుతోందా అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. అవసరమైతే ఇతర ఈ-కామర్స్ సంస్థల విక్రయ విధానాలను కూడా పరిశీలించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బ్లింకిట్ (Blinkit) సంస్థ నుంచి విక్రయ వివరాలు, కొనుగోలుదారుల సమాచారం, డెలివరీ ప్రక్రియకు సంబంధించిన డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. చట్టపరమైన బాధ్యతలు నిర్ధారించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసు నేపథ్యంలో ఆన్లైన్ వాణిజ్య సంస్థలు ఆయుధాల విక్రయంపై మరింత కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: వివాదాల ‘ఇంపాక్ట్’.. ఏఐ సమ్మిట్‌లో రోబో డాగ్ రభస
Follow Us On: Instagram


