కలం, వెబ్ డెస్క్: ఊపిరాడకుండా టవల్‌తో గొంతు బిగించి భార్యను దారుణంగా హత్య చేశాడు ఇస్రో మాజీ అధికారి ఒకరు (Retired ISRO Employee). ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) శివార్లలోని అవలహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మెనహళ్లి ఏరియాలో ఇస్రో రిటైర్డ్ ఉద్యోగి నాగేశ్వరరావు(65), సంధ్య శ్రీ దంపతులు నివసిస్తున్నారు. ఈ క్రమంలో సంధ్య శ్రీని తన భర్త హత్య చేసినట్లు బుధవారం ఉదయం 11గంటల సమయంలో పోలీసులకు ఫోన్లో సమాచారం అందింది. వాళ్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కొన్నేళ్లుగా నాగేశ్వర రావు (Retired ISRO Employee) డిప్రెషన్‌తో బాధ పడుతున్నట్లు తేలింది. ఒత్తిడి, తీవ్ర ఆందోళన తట్టుకోలేక భార్యను హత్య చేసి అనంతరం తానూ చనిపోవడానికి సిద్ధమయ్యాడు. అయితే చివరి క్షణంలో మనసు మార్చుకొని సన్నిహితుల్లో ఒకరికి కాల్ చేసి, హత్య విషయం చెప్పాడు. ఆ వ్యక్తి అందించిన సమాచారంతో సంఘటన స్థలానికి వచ్చి నిందితుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ దంపతుల కుమార్తె అమెరికాలో నివసిస్తోంది. ఆమెకు విషయాన్ని చేరవేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: తెలంగాణలోనే ఈవీల తయారీ: సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: X(Twitter)


