కలం, సిటీ బ్యూరో : మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదుపరి టార్గెట్ ఏంటనే చర్చ మొదలైంది. అటు అధికార పార్టీలో, ఇటు ప్రతిపక్ష పార్టీల్లోనూ ఇదో హాట్ టాపిక్. మొత్తం 116 మున్సిపాలిటీల్లో 90 స్థానాలను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకున్నది. బీఆర్ఎస్ 19 చోట్ల గెలిచింది. మొత్తం ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఐదు చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ప్రజలు కాంగ్రెస్‌వైపే ఉన్నారన్న ఉత్సాహం ఆ పార్టీ నేతల్లో, శ్రేణుల్లో కనిపించింది. ఈ ఉత్సాహంతోనే వీలైనంత తొందరగా జీహెచ్ఎంసీ ఎన్నికలను (GHMC Elections) కూడా నిర్వహించాలని అభిప్రాయాలు పార్టీ నేతల నుంచి వ్యక్తమయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి సైతం అదే అభిప్రాయంతో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకంటే ముందే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేలా కసరత్తు ప్రారంభమైంది. ప్రభుత్వ అధికారిక ప్రకటన కోసం పార్టీల్లో ఎదురుచూపులు మొదలయ్యాయి.
మున్సిపల్ ఉత్సాహంతో గ్రేటర్ ఎన్నికలు :
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు పూర్తికాగానే తొలుత గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలన్నది ప్రభుత్వ ఆలోచన. జీహెచ్ఎంసీ పదవీకాలం ఇటీవలే ముగిసింది. ఇంతకాలం జీహెచ్ఎంసీగా కొనసాగిన కార్పొరేషన్ ఇటీవలే జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లుగా విడిపోయాయి. ఈ మూడింటికీ కలిపి ఎన్నికలు నిర్వహించడం అనివార్యమైంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో వెంటనే ఈ మూడు కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహిస్తే అనుకూల ఫలితాలు వస్తాయన్నది పార్టీ ఉద్దేశం. అందులో భాగంగానే ప్రాథమిక స్థాయిలో కసరత్తు మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పురపాలక శాఖ అధికారులతో తాజాగా నిర్వహించిన సమావేశంలో కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మౌలిక సౌకర్యాల కల్పనపై చర్చించి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
రాష్ట్ర బడ్జెట్ సెషన్ తర్వాత ముహూర్తం :
రాబోయే ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ కసరత్తు జరుగుతున్నందున ఆ తర్వాత ఈ మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు వచ్చే అవకాశమున్నది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రభుత్వం లాంఛనంగా ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించవచ్చన్నది మున్సిపల్ శాఖ వర్గాల సమాచారం. ఎన్నికల షెడ్యూలు వెలువడడానికి ముందే నగరంలోని కొన్ని కీలకమైన సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే రోడ్లు, పారిశుద్యం, మౌలిక సౌకర్యాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ట్రాఫిక్ జంక్షన్లు, స్మార్ట్ పోల్స్, సిగ్నలింగ్ సిస్టమ్, ఎలక్ట్రిక్ కేబుల్ వ్యవస్థ, మల్టీలెవల్ పార్కింగ్, రోడ్లపై ట్రాఫిక్ సమస్య.. ఇలాంటివాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. గ్రేటర్‌లోని మున్సిపల్ అధికారులు ఏసీ గదులు వదిలి ఉదయం ఆరు గంటలకే ఫీల్డులో ఉండాలని, పనులపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఫార్ములా :
పంచాయతీ ఎన్నికల్లో జరిగిన పొరపాటలను సరిదిద్దుకోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం లభించిందన్నది సీఎం సహా మంత్రులందరి భావన. ప్రతీ పార్లమెంటు సెగ్మెంట్‌ను ఒక యూనిట్‌గా తీసుకుని మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పడం, పార్టీ నేతల మధ్య సమన్వయం, పూర్తిస్థాయిలో ఎలక్షన్ క్యాంపెయిన్‌పైనే ఫోకస్ పెట్టడం.. ఇలాంటివన్నీ విజయానికి కలిసొచ్చిన అంశాలన్నది లీడర్ల భావన. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో సైతం నిర్దిష్టంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్ల మధ్య వర్క్ డివిజన్, సీరియస్ ఎఫర్ట్స్ కారణంగా విజయం సాధ్యమైందన్నది పార్టీ అభిప్రాయం. ఇప్పుడు గ్రేటర్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములాను మరింత పకడ్బందీగా అమలు చేయాలన్నది పార్టీ ఉద్దేశం.
Read Also: కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు జస్టిస్ సుదర్శన్‌రెడ్డి?
Follow Us On : WhatsApp


