కలం, ఖమ్మం బ్యూరో: దివ్యాంగులు వైకల్యాన్ని లోపంగా భావించకుండా బలమైన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వం తరఫున 100 శాతం సబ్సిడీపై మంజూరైన త్రీ వీలర్ సైకిళ్లను మంత్రి పొంగులేటి ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమానికి, వారి ఆర్థిక సామాజిక వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సంపూర్ణంగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా తమ స్వశక్తితో జీవించేందుకే ప్రభుత్వం సహాయ ఉపకరణాలను అందిస్తోందని, ఈ ట్రై మోటార్ సైకిళ్లు వారి రవాణా సౌకర్యాన్ని సులభతరం చేయడానికి ఎంతో తోడ్పడతాయని తెలిపారు. జీవితంలో సరైన పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని, దివ్యాంగులు సమాజంలో స్వయం సమృద్ధి సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి దివ్యాంగునికి ప్రభుత్వ పథకాలు, పింఛన్లు ఇతర సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

