కలం, నిర్మల్: పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు నిర్మల్ (Nirmal) రూరల్ మండలం ముక్తాపూర్ (Mukthapur) గ్రామస్తులు ఏకమయ్యారు. ప్లాస్టిక్‌కు గుడ్ బై చెబుతూ గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (Single-Use Plastic) వినియోగాన్ని అరికట్టాలని ముక్తకంఠంతో ప్రతిజ్ఞ చేశారు. బుధవారం గ్రామ సర్పంచ్ మాన్పూరి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డీఎల్పీవో లింగయ్య, ఎంపీడీవో సుధాకర్ గ్రామస్తులకు చెత్తబుట్టలు, జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. చెత్తబుట్టలను ఇతర అవసరాలకు వినియోగించకుండా, తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణంతో పాటు మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని కోరారు.
శుభకార్యాలకు ‘స్టీల్ బ్యాంక్’
ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వినియోగాన్ని తగ్గించేందుకు గ్రామపంచాయతీలో సర్పంచ్ మాన్పూరి రమేష్ వినూత్నంగా స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. గ్రామంలో నిర్వహించే శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలకు అవసరమైన స్టీల్ ప్లేట్లు, గ్లాసులు తదితర సామగ్రిని అందుబాటులో ఉంచారు. గ్రామస్తులు ఎవరైనా శుభకార్యాలు నిర్వహించినప్పుడు ఈ సామగ్రిని ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపారు.
ఇకపై గ్రామంలో జరిగే ఎలాంటి శుభకార్యంలోనూ ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు వినియోగించకుండా స్టీల్ సామగ్రినే ఉపయోగించాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నరేష్, పంచాయతీ కార్యదర్శి చంద్రభూషణ్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

