కలం, వెబ్ డెస్క్: హిందువులకు ఎంతో పవిత్రమైన చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra 2026) ఈ ఏడాది ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు అలర్ట్. ఈసారి యాత్ర రిజిస్ట్రేషన్‌కు ఫీజు వసూలు చేయనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు మంగళవారం తెలిపారు. ఫీజు ఎంత మేర ఉంటుందనేది త్వరలోనే చెబుతామన్నారు.
యాత్ర నిర్వహణపై రుషికేశ్‌లో గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే అధ్యక్షతన సమావేశం జరిగింది. యాత్ర సాఫీగా, భద్రంగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే ఈసారి రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయాలని తీర్మానించారు. కాగా, ఈ సీజన్లో భక్తుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదని పాండే తెలిపారు. అయితే ప్రతి యాత్రికుడూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. నకిలీ రిజిస్ట్రేషన్లు అరికట్టేందుకే ఈసారి ఫీజు వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఉత్తరాఖండ్‌లోని మంచుపర్వతాల్లో ఉండే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను కలిపి చార్ ధామ్‌గా వ్యవహరిస్తారు (Char Dham Yatra 2026). అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల్లో ఈ పవిత్ర స్థలాలకు చేరుకుని, దైవ దర్శనం చేసుకోవడం కోసం ఏటా వేలాది మంది వెళుతుంటారు.


