కలం, వెబ్‌డెస్క్: రోజురోజుకూ వాహన కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఫలితంగా పర్యావరణం దెబ్బతింటోంది. ఎన్నో జీవరాశులు క్రమేపీ అంతరించిపోతున్నాయి. పంటల దిగుబడి సైతం తగ్గుతోంది. ఈ క్రమంలో కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణలో తన వంతు బాధ్యతగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI) సరికొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోంది. నేషనల్ హైవేల వెంబడి బీ (తేనెటీగల) కారిడార్లు నిర్మించనున్నట్లు ప్రకటించింది (Bee Corridors). దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన మూడు జాతీయ రహదారుల వెంబడి వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడు బీ కారిడార్లు నిర్మించనుంది.
ఏమిటీ బీ కారిడార్లు?
ప్రస్తుతం జాతీయ రహదారుల వెంబడి అటు ఇటు, డివైడర్ల మధ్య భాగంలో కొన్ని రకాల చెట్లను, మొక్కలను పెంచుతున్నారు. అయితే, వీటిలో అధిక భాగం కేవలం అలంకారం కోసం మాత్రమే పెంచేవి. ఫలితంగా కాస్తంత పచ్చదనం, రోడ్లు అందంగా కనిపించినా పర్యావరణం పరంగా పెద్దగా ఉపయోగపడడం లేదని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే బీ కారిడార్లను నిర్మించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రోడ్లకు ఇరువైపులా, డివైడర్ల మధ్య భాగంలో అలంకారానికి పనికి వచ్చే మొక్కలు, చెట్లకు బదులు తేనెటీగలను ఆకర్షించే పూలు, పండ్ల రకాల మొక్కలు, చెట్లను పెంచనుంది. వీటినే బీ(తేనెటీగ) కారిడార్లుగా అంటారు. వీటి వల్ల మూడు విధాలుగా ప్రయోజనం ఉంటుందని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది.
ఎందుకివి?
వాస్తవానికి కాలుష్యం మనుషులకే కాదు పక్షులు, జంతువులకూ ప్రాణాంతకంగా మారింది. అలాగే పంటల దిగుబడీ తగ్గుతోంది. ముఖ్యంగా కాలుష్యం కారణంగా అంతరించిపోయే జాబితాలో తేనెటీగలు చేరినట్లు ఇప్పటికే అనేక సర్వేలు హెచ్చరించాయి. ఇవి లేకపోతే పంటల దిగుబడీ తగ్గుతుంది. కారణం.. పంట పండడంలో కీలకమైన పరాపరాగ సంపర్కం తేనెటీగల వల్లే జరుగుతుంది. అందువల్ల పుష్పించే మొక్కలు ఎక్కువ అందుబాటులో ఉంటే తేనెటీగల నివాసానికి పనికి వస్తుంది. తద్వారా పంటల అధిక దిగుబడికీ ఉపయోగపడుతుంది.
అందువల్ల బీ కారిడార్లలోని తేనెటీగలకు అనుకూలమైన రకరకాల పుష్పించే మొక్కలు, తీగలు, చిన్న చిన్న పొదలు, చెట్లు వంటి వాటిని పెంచడం ద్వారా రోడ్ల వెంట ఆహ్లాదంతోపాటు కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ, పంటల దిగుబడికి మేలు జరుగుతుందని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది.
కాగా, ఇప్పటికే విదేశాల్లో ఇలాంటి బీ కారిడార్లు ఉన్నాయి(Bee Corridors). ప్రపంచంలోని మొట్టమొదటి బీ కారిడార్‌గా నెదర్లాండ్స్‌లోని ఓస్లో బీ హైవేను చెప్పుకోవచ్చు. అలాగే, అమెరికా, కెనడాలో ది పాలినేటర్ పాత్వే పేరుతో కారిడార్ ఉంది. యూకే, ఎస్తోనియా, ఇటలీ, బ్రెజిల్, మెక్సికోలోనూ బీ కారిడార్లు ఉన్నాయి.
Read Also: గంజాయితో తండాయి మిల్క్.. HYD సర్కిళ్లలో అమ్ముతున్న వ్యక్తి
Follow Us On: Instagram


