epaper
Wednesday, February 18, 2026
epaper

ఈ నెల 23న స్టేట్ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రివర్గ (Telangana Cabinet) సమావేశం ఈ నెల 23న జరగనున్నది. మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా మంత్రివర్గ సమావేశం జరిగిన తర్వాత మళ్ళీ నెల రోజులకు ఇప్పుడు జరగబోతున్నది. సచివాలయంలో ఆ రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు జరిగే ఈ క్యాబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశమున్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మూడుగా డివైడ్ అయిన నేపథ్యంలో పరిపాలనా సంబంధమైన అంశాలతో పాటు తదుపరి ఎన్నికల నిర్వహణ గురించి చర్చించే అవకాశమున్నది. దీనికి తోడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా నిర్వహించాల్సి ఉన్నందున వీటిపైనా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశమున్నది. విద్యార్థుల పరీక్షలు, పలు కోర్సులకు ఎంట్రన్స్ టెస్టులు, వేసవి కాలం… వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తేదీలను ఖరారు చేసే అవకాశమున్నది.

బడ్జెట్ రూపకల్పనపై ప్రధాన చర్చ :

రాబోయే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్న నేపథ్యంలో గతంతో పోలిస్తే ఏ తీరులో ఉండాలనే అంశంపై మంత్రివర్గ (Telangana Cabinet) సమావేశంలో చర్చ జరిగే అవకాశమున్నది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో త్వరలో డిపార్టుమెంట్లవారీగా రివ్యూ మీటింగులు జరగాల్సి ఉన్నందున ఏయే శాఖల నుంచి ఎలాంటి ప్రతిపాదనలు వచ్చాయో చర్చించి రానున్న బడ్జెట్‌లోని ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రాథమిక స్థాయిలో నిర్ణయాలు జరిగే అవకాశమున్నది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కూడా ఏయే తేదీలు అనుకూలంగా ఉంటాయో చర్చించి డ్రాఫ్ట్ షెడ్యూలును ఖరారు చేసే అవకాశమున్నది. దీనికి తోడు మూసీ పునరుజ్జీవన పథకం, రైతుభరోసా స్కీమ్‌కు నిధుల విడుదల, ధాన్యం కొనుగోళ్ళు తదితరాలపై కూడా చర్చ జరిగే అవకాశమున్నది.

మూడు రోజుల ఢిల్లీ పర్యటన :

వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముంబాయి వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఈ నెల 19, 20 తేదీలల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. అక్కడి భారత్ మండపంలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్‌ ఇనాగరల్ కార్యక్రమంలో ప్రధాని మోడీతో కలిసి పాల్గొననున్నారు. ఆ తర్వాతి రోజున ‘కీ నోట్ అడ్రస్’ ఇవ్వనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ నుంచి ఆహ్వానం అందింది. ఈ పర్యటనలో భాగంగానే పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించేందుకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాహుల్‌గాంధీ తదితరులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రంలో ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, త్వరలో రూపొందించనున్న బడ్జెట్‌లో పొందుపర్చనున్న అంశాలు తదితరాలపై వారికి సీఎం వివరించనున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత స్టేట్ క్యాబినెట్ భేటీ జరుగుతుండడంతో కీలక అంశాలపై ఇన్‌ఫార్మల్‌గా మంత్రులతో చర్చించే అవకాశమున్నది.

Read Also: ముంబై రోడ్లపై పరుగులు తీసిన ఫ్రాన్స్​ అధ్యక్షుడు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>