కలం, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడెక్కింది. సోమవారం కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనున్న నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మంత్రులతో జూమ్ మీటింగ్ నిర్వహించి కీలక దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకోవాలని, ఎక్స్ అఫీషియో ఓట్ల వినియోగంపై అలర్ట్గా ఉండాలని ఆదేశించారు. స్వతంత్రులు, ఇతర పార్టీల కౌన్సిలర్లు ముందుకొస్తే, కలుపుకుని పోవాలని మంత్రులు, కాంగ్రెస్ నేతలకు సూచించారు.
రాష్ట్రంలోని హంగ్ మున్సిపాలిటీల్లో సుమారు 25కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ (Congress) విజయం సాధించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటు పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మంత్రులు, కీలక నేతలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి, మేయర్లు, చైర్మన్ల ఎంపిక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. హంగ్ ఏర్పడిన చోట్ల కాంగ్రెస్తో పాటు, బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయంగా పావులు కదుపుతుండటంతో ఉత్కంఠ నెలకొంది.


