కలం, వెబ్ డెస్క్ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేశంలోని పత్తి రైతులకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కానుకను అందించారు. భోపాల్‌లోని ఐసీఏఆర్ – సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (CIAE) శాస్త్రవేత్తలు రూపొందించిన అత్యాధునిక కాటన్ హార్వెస్టింగ్ మెషిన్ (Cotton Harvesting Machine)ను ఆయన ఈరోజు రైతులకు అంకితం చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇప్పటివరకు పత్తి సాగులో కాయల కోత అనేది పూర్తిగా చేతులతోనే జరగడం వల్ల రైతులకు సమయం, శ్రమ రెండూ వృథా అయ్యేవి. కూలీల ఖర్చు విపరీతంగా పెరగడం వల్ల సాగు వ్యయం కూడా భారంగా మారేది. ఈ సమస్యను పరిష్కరించాలని రైతుల నుంచి వచ్చిన విన్నపాల నేపథ్యచంలో ఈ యంత్రాన్ని అభివృద్ధి చేయడం విశేషం. ఈ యంత్రం ద్వారా పత్తి సేకరించే విధానాన్ని స్వయంగా పరిశీలించిన మంత్రి, ఇది పత్తి సాగులో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అధునాతన యంత్రాలతో పాటు పత్తి దిగుబడిని పెంచేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడిని ఇచ్చే కొత్త రకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారని, తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటడం ద్వారా ఎకరాకు ఉత్పత్తిని పెంచే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఈ మెషిన్ (Cotton Harvesting Machine) రైతులకు అందుబాటులోకి రానుంది, ఇది సాగు ఖర్చును తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: సిద్ధ రామయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన డీకే శివకుమార్
Follow Us On: Instagram


