కలం/ఖమ్మం బ్యూరో : కొత్తగూడెం (Kothagudem) కార్పొరేషన్ లో సీపీఐ, కాంగ్రెస్ పవర్ షేరింగ్ తో ఉత్కంఠ కు తెర పడింది. చెరో రెండున్నరేళ్లు మేయర్ పదవి పంచుకున్నాయి పార్టీలు. మొదటగా సీపీఐకి ఛాన్స్ దక్కింది. ఇక మేయర్ పీఠం కోసం ప్రధానంగా ముగ్గురు కార్పొరేటర్లు పోటీలో ఉన్నారు. కార్పొరేషన్ మేయర్ పీఠం ఎస్టీ జనరల్ కు రిజర్వు అయిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి మొత్తం 11 స్థానాలు ఎస్టీకి రిజర్వ్ అయ్యాయి. సీపీఐ తరపున కేవలం ముగ్గురు కార్పొరేటర్లు మాత్రమే ఎస్టీ కోటాలో ఎన్నికయ్యారు. మిగిలిన వారు ఇతర పార్టీల్లో గెలిచారు. కాబట్టి గెలిచిన ఆ ముగ్గురిలో ఒక్కరు మాత్రమే మేయర్ పీఠం అధిరోహించే అవకాశం ఉంది. ఈ ముగ్గురిలో కూడా ఇద్దరు మహిళలు ఉండటం గమనార్హం.
కొత్తగూడెం (Kothagudem) కార్పొరేషన్ లోని 20వ డివిజన్ నుంచి మూడ్ గణేష్, 31 వ డివిజన్ నుంచి నూనావత్ శ్యామల, 52వ డివిజన్ నుంచి బానోతు కళావతి కార్పొరేటర్లుగా గెలిచారు. మహిళా సాధికారతకు ఎక్కువ సీపీఐ ప్రాధాన్యత ఇస్తే నూనావత్ శ్యామల, బానోత్ కళావతిలో ఒకరికి అవకాశం దక్కుతుంది. ఈ ఇద్దరిలో కూడా బానోతు కళావతికి పార్టీలో ఎక్కువ పలుకుబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె పార్టీలో చాలా సీనియర్ నాయకురాలు. అంతే కాకుండా అందరినీ కలుపుకుపోయే స్వభావంతో పాటు జిల్లా కేడర్ లో చురుకుగా వ్యవహరిస్తారనే పేరు కూడా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇంకోపక్క మూడ్ గణేష్ కు కూడా పార్టీలో మంచి పేరు ఉంది. కార్పొరేషన్ లో పార్టీ కోసం బాగానే కష్టపడుతాడు అనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ ముగ్గురిలో అదృష్టం ఎవరిని వరించ బోతోంది అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.


