కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని చారిత్రక ఆలయాలకు యునెస్కో(UNESCO) గుర్తింపు దక్కాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. ఆదివారం ఉదయం నల్లగొండ జిల్లా పానగల్లో మంత్రి పర్యటించారు. శివరాత్రి సందర్భంగా స్థానిక ఛాయా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రైతాంగానికి మేలు జరగాలని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. ప్రజలు నల్లగొండ కార్పొరేషన్‌ను గెలిపించి బహుమతిగా ఇచ్చారని, మేయర్ ఎన్నిక తర్వాత అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయని మంత్రి వెల్లడించారు. రానున్న రోజుల్లో చారిత్రక ఆలయాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆలయాలకు యునెస్కో గుర్తింపు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. యునెస్కో గుర్తింపు వస్తే ఆలయాల అభివృద్ధికి మరిన్ని నిధులు వస్తాయని తెలిపారు.


