కలం, డెస్క్ : కరీంనగర్ (Karimnagar) మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠగా మారింది. ఇక్కడ ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాలేదు. 30 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. మొత్తం 66 సీట్లు ఉన్న కరీంనగర్ లో.. మ్యాజిక్ ఫిగర్ 34. బీజేపీకి ఇంకో నలుగురు అవసరం ఉంది. అటు కాంగ్రెస్ కు 14 స్థానాలు రాగా, బీఆర్ ఎస్ నుంచి 9 మంది గెలిచారు. ఎంఐఎం నుంచి ముగ్గురు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్లు 8 స్థానాల్లో విజయం సాధించారు. ఇందులో ఒకరు బీఆర్ ఎస్ రెబల్ గా పోటీ చేశారు.
ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో అన్ని పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెర తీశాయి. బీజేపీ నుంచి గెలిచిన 30 మందితో పాటు 13వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ తెల్ల లక్ష్మీ, 17వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ వేముల కవిత-చంద్రశేఖర్, 15వ డివిజన్ ఏఐఎఫ్ బీ కార్పొరేటర్ విపల సాయిజ్యోతి, 39వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ మాసం గణేశ్ ఇప్పటికే కేంద్రమంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ సంఖ్య 34కు చేరింది. వీరందరినీ హైదరాబాద్ శివారులోని బీజేపీ క్యాంపునకు తరలించారు. బండి సంజయ్ కు ఎక్స్ అఫిషియో ఓటు ఉండటంతో బీజేపీ సంఖ్య 35కు చేరింది.
అయితే అటు కాంగ్రెస్ కూడా తమకు సంఖ్యాబలం ఉందని చెబుతోంది. కరీంనగర్(Karimnagar) కార్పొరేషన్ ను దక్కించుకునే బాధ్యతను మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లకు అప్పగించింది పార్టీ అధిష్టానం. దీంతో వారిద్దరూ ఇప్పటికే కరీంనగర్ చేరుకున్నారు. ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ కు ఇంకా 20 మంది కార్పొరేటర్లు కావాలి. ఎక్స్ అఫిషియో ఓట్లతో చూసినా బలం సరిపోదు. అటు బీఆర్ ఎస్ నుంచి గెలిచిన 9 మందితో పాటు రెబల్ గా గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలోనే ఉన్నారు. వాళ్లెవరూ పార్టీ మారబోరని.. ఎవరికీ మద్దతు ఇవ్వరని బీఆర్ ఎస్ చెబుతోంది. అటు ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతుందా లేదా అనేది ఇంకా తెలియదు. బీజేపీకి సరిపడా సంఖ్యా బలం ఉండటం వల్ల.. ఆ పార్టీకే కార్పొరేషన్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఎప్పుడు ఏం జరుగుతుందో వేచి చూడాలి.


