కలం, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ ప్రధాన ప్రతిపక్షం అని తేలిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. చాలా మున్సిపాలిటీల్లో హంగ్ ఉండే పరిస్థితి ఉందని చెప్పారు. అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. రీకౌంటింగ్ల పేరుతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారని ప్రకటించేవరకు అధికార యంత్రాంగం మీద ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.
అధికార పార్టీ ఎన్ని ఒత్తిళ్లకు గురి చేసినా.. బెదిరింపులకు గురి చేసినా తమ కార్యకర్తలు ధైర్యంగా ప్రభుత్వంతో పోరాడారని గుర్తు చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా తమ పాత్రను సమర్థంగా పోషించామని పేర్కొన్నారు. ఏ నేతకు అధికారం శాశ్వతం కాదని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లాంటి పెద్ద పెద్ద నేతలే ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పారు. తమ అధినేత కేసీఆర్ కూడా కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేశారు.
2020లో 130 మేయర్లకు, చైర్ పర్సన్లకు మున్సిపల్ ఎన్నికలు జరిగితే అందులో బీఆర్ఎస్ పార్టీ 122 గెలిస్తే, కాంగ్రెస్ 4, బీజేపీ 2, ఎంఐఎం 2 గెలిచింది. వెలువడిన ఫలితాల్లో ఇప్పటికే ప్రత్యక్షంగా 15 స్థానాల్లో తాము గెలువబోతున్నామని చెప్పారు. ఇంకా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మరో 15 చోట్ల తమ పార్టీకి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 2581 మున్సిపల్ వార్డులలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 750 వార్డులు గెలిచిందని.. ఈ ఎన్నికల్లో కూడా 30 శాతానికి పైగా సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ తామే గెలిచామని సంబురాలు చేసుకుంటున్నదని.. కానీ ఫలితాలు ఏకపక్షంగా ఏమీ లేవని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు.
Read Also: కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Follow Us On: Sharechat


