కలం, ఖమ్మం బ్యూరో : నూతనంగా ఏర్పడిన కొత్తగూడెం (Kothagudem Corporation) కార్పొరేషన్‌లో సీపీఐ (CPI) పార్టీ 22 స్థానాలు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ తన మిత్రపక్షం సీపీఏం (CPM) తో కలిసి 23 స్థానాలు గెలిచింది. సీపీఐకి మేయర్ పీఠం కైవసం చేసుకోవాలంటే ఇంకా తొమ్మిది మంది మద్దతు అవసరం ఉంది. ఇక్కడే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) రాజకీయ చాణిక్యతను ప్రదర్శించనున్నారు. అందులో భాగంగా స్వతంత్రుల ఐదుగురితో మంతనాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ (BRS) వారితో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ నుంచి వచ్చే వారికి డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరో పక్క కాంగ్రెస్, సీపీఎం 23 స్థానాల్లో విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్ కు 8 సీట్ల దూరంలో ఉన్నాయి. కాంగ్రెస్ తన అధికార బలాన్ని ఉపయోగించి ఇండిపెండెంట్లకు ఎరవేసి లాగుతుందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. కానీ అలా స్వతంత్రులు ఐదుగురు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినా ఇంకా మూడు సీట్లు తక్కువ పడతాయి. కాంగ్రెస్‌కి ఎలాగు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వదు అనేది అందరికీ తెలిసిన విషయమే. బీజేపీ కూడా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అవకాశం లేదు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవేళ కూనంనేనితో (Kunamneni Sambasiva Rao) మాట్లాడితే సీపీఐ కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను పంచుకునే అవకాశం కూడా ఉంది. అయితే సీపీఐ, కాంగ్రెస్ పొత్తు దాదాపుగా ఉండకపోవచ్చు అని ఇటీవల జరిగిన పరిణామాలను బట్టి రాజకీయ విశ్లేషకులు ఒక అంచనాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ స్వతంత్రులతో పాటు బీఆర్ఎస్ నుంచి కొందరిని తమ పార్టీలోకి లాగే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి డిప్యూటీ మేయర్ పదవిని ఆశిస్తున్న ఇద్దరు మహిళలతో సీపీఐ టచ్‌లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Read Also: ఛత్తీస్‌గఢ్‌లో మావోలకు భారీ దెబ్బ.. 14 నెలల్లో 532 మంది మృతి, 2700 మంది సరెండర్
Follow Us On: Youtube


