epaper
Wednesday, February 18, 2026
epaper

మేయర్లు, చైర్‌పర్సన్లపై భ్రమల్లేవ్ !.. ఓటింగ్ పర్సెంటేజ్‌పైనే బీఆర్ఎస్ ఫోకస్

కలం, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం ఇతర పార్టీలన్నింటికంటే ముందుగా అలర్టయ్యింది బీఆర్ఎస్ (BRS). జిల్లాలవారీగా పార్టీ లీడర్లు, కేడర్‌తో సన్నాహక సమావేశాలు నిర్వహించింది. అప్పటికింకా షెడ్యూలు కూడా రాలేదు. అన్ని జిల్లాలతో సమీక్షలు నిర్వహించి అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జిలను నియమించింది. కనీసంగా 35 కంటే ఎక్కువ మున్సిపాలిటీల చైర్‌పర్సన్ పోస్టులు ఖాయమనే ధీమాను వ్యక్తం చేసింది. పోలింగ్ ముగిసింది.. ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్డాయి. పాతిక కంటే ఎక్కువ గెలుపొందే అవకాశాల్లేవని, ఒక్క కార్పొరేషన్‌ కూడా గెలిచే చాన్స్ లేదని తేలింది. దీంతో ఒకింత నిరుత్సాహం ఆ పార్టీ కేడర్‌లో వ్యక్తమవుతున్నది. మేయర్లను, మున్సిపల్ చైర్‌పర్సన్లను గెలుస్తామనే భ్రమలు తమకు లేవనే అభిప్రాయాన్ని పలువురు నేతలు వెలిబుచ్చారు.

పోలింగ్ పర్సంటేజీపైనే మెయిన్ ఫోకస్ :

కార్పొరేషన్ మేయర్ (Corporation Mayor) స్థానం ఒక్కటీ దక్కే అవకాశం లేకపోవడంతో మరోసారి ‘గుండు సున్నా’ అనే విమర్శను తప్పేలా లేదు. ఈ కారణంగా “అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. మేయర్, మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాలు దక్కుతాయనే ఆశలు మాకేం లేవు. ఎన్ని వార్డుల్లో గెలిచాం.. ఎంత మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గెలిచారు.. మా పార్టీకి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత వచ్చింది.. అధికార పార్టీతో పోలిస్తే ఎంత వ్యత్యాసమున్నది.. ఇవే మేం లెక్కలోకి తీసుకోదల్చుకున్నాం..” అని బీఆర్ఎస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఫలితాలు (Municipal Poll Results) వెల్లడైన తర్వాత ఈ అంశాలనే ఆ పార్టీ ప్రధానంగా ప్రస్తావించనున్నది. “ఎలాగూ మా పార్టీ తరఫున గెలిచిన వారంతా మాతోనే కంటిన్యూ అవుతారనే భ్రమలు కూడా మాకు లేవు.. అంతా కొనడం.. అమ్ముడుపోవడమే..” అని కామెంట్ చేశారు.

పరువు కాపాడుకునే ప్రయత్నం :

మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క కార్పొరేషన్ గెలవలేకపోయినా ఇతర పార్టీలు చేసే విమర్శలకు సమాధానం చెప్పడానికి లాజిక్ సిద్దం చేసుకుంటున్నది బీఆర్ఎస్. మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ పోస్టుల్ని దక్కించుకోలేకపోయినా లైట్‌గానే తీసుకోవాలనుకుంటున్నది. బీఆర్ఎస్ బీ-ఫామ్ మీద ఎంతమంది పోటీచేశారు.. ఎంతమంది గెలిచారు.. ఎన్ని ఓట్లు వచ్చాయి.. మొత్తం పర్సంటేజీ ఎంత.. ఇలాంటి లెక్కలను చెప్పి కాంగ్రెస్‌తో పోటీపడగలిగామనే వాదనను వినిపించే అవకాశమున్నది. ఇందుకోసం కొన్ని లెక్కలను కూడా ప్రస్తావించాలని భావిస్తున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినా కాంగ్రెస్‌తో పోలిస్తే తక్కువ తేడా మాత్రమే ఉన్నదనే అంశాన్ని పదేపదే ప్రస్తావించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే వాదనను తెరపైకి తేనున్నది.

గెలిచినా, జంప్ అయినా వారు మావారే :

బీఆర్ఎస్ (BRS) తరఫున పోటీ చేసి గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఆ పార్టీ విజేతలుగానే రికార్డుల్లోకి ఎక్కుతారు. గెలిచిన తర్వాత వారు ఏ పార్టీలోకి వెళ్ళిపోయినా రికార్డుల్లో మాత్రం బీఆర్ఎస్ సాధించిన విజయంగానే ఉండిపోతుంది. పార్టీకి పడిన ఓట్లు, పర్సంటేజీ కూడా రికార్డుల్లో నిక్షిప్తమవుతుంది. ఇలాంటి వివరాలన్నింటినీ ఏకరువు పెట్టి కాంగ్రెస్‌, బీజేపీలతో పోల్చి వివరణ ఇచ్చేందుకు రెడీ అవుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలకు ఎంత పర్సంటేజీ వచ్చిందో సర్దిచెప్పినట్లుగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ అలాంటి వాదనే తెరమీదకు తెచ్చే అవకాశమున్నది. అదే సమయంలో పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ప్రజానీకం, మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు బీఆర్ఎస్‌ను ఏ మేరకు ఆదరించారనేది విశ్లేషించుకుని పార్టీ పరిస్థితిని అంచనా వేసుకోనున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రెడీ కావడానికి తగిన వ్యూహంపై దృష్టి పెట్టనున్నది.

Read Also: మార్చి థర్డ్ వీక్‌లో అసెంబ్లీ సెషన్?.. ఈ నెల 17 నుంచి బడ్జెట్ రివ్యూలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>