ఢిల్లీ ఎర్రకోట(Delhi Blast) వద్ద జరిగిన బాంబు దాడి కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. పేలుడు కేసులో హర్యానాలోని అల్ ఫలా యూనివర్సిటీ(Al Falah University) పేరు ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే. నిందితులు ఈ వర్సిటీకి సంబంధించిన వారు కావడంతో ఆ కోణంలో దర్యాప్తు సాగుతోంది. వర్సిటీ చైర్మన్ జావెద్ సిద్దిఖీ(Javed Ahmed Siddiqui) అక్రమాలపై కూడా దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. తాజాగా అతడికి మధ్యప్రదేశ్‌లోనూ అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు తాజాగా వెల్లడైంది. మధ్యప్రదేశ్‌లోని మోవ్ కంటోన్మెంట్లో జావెద్ కుటుంబానికి కుటుంబసభ్యుల పేరిట అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో త్వరలో ఈ అక్రమ నిర్మాణాలను కూల్చేయబోతున్నారు.
ఇక ఢిల్లీ బాంబు పేలుడుకు సంబంధించి డాక్టర్ ఉమర్ నబీ ఈ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసినట్లు గుర్తించిన విషయం తెలిసిందే . ఫరీదాబాద్‌లోని ఉగ్ర మాడ్యూల్‌ను పోలీసులు చేధించిన సమయంలో, ఈ పేలుడు కూడా చోటుచేసుకుంది. దర్యాప్తులో, ఈ మాడ్యూల్లో ఉన్న వ్యక్తులకు అల్ ఫలా యూనివర్సిటీ(Al Falah University)తో సంబంధం ఉన్నట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు యూనివర్సిటీపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం, 24 ఇతర ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. జావెద్ సిద్దిఖీ విద్యార్థుల నుండి ₹415 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ మొత్తం తప్పుడు అక్రిడిటేషన్ ఆధారంగా విద్యార్థుల నుంచి వసూలు చేశారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎటువంటి అక్రమాలు వెలుగు చూస్తాయో వేచి చూడాలి.
Read Also: అల్ ఫలా వర్సిటీ నుంచి 10 మంది మిస్సింగ్
Follow Us on: Youtube

