కలం, వెబ్‌డెస్క్: నిఫా వైరస్ (Nipah Virus) ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వ్యాధి కారణంగా పశ్చిమ బెంగాల్లో తొలి మరణం నమోదైంది. నిఫా లక్షణాలతో ఉత్తర 24 పరగణాల జిల్లా బరాసత్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్స్ (25) గురువారం ప్రాణాలు విడిచింది. ఇది ఆ రాష్ట్రంలో నిఫా కారణంగా నమోదైన తొలి మరణం. కాగా, ఈమెతోపాటు మరో మేల్ నర్స్ కూడా నిఫా లక్షణాలతో కొన్ని రోజుల కిందట ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే, మేల్ నర్స్ కోలుకొని డిశ్చార్చ్ అవగా, ఈమెను ఐసీయూలో చేర్చి చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు.
వ్యాప్తిపై ఆందోళన..
బరాసత్ ఆసుపత్రిలో ఇద్దరు నర్సింగ్ సిబ్బంది నిఫా బారినపడిన విషయం వెలుగులోకి వచ్చినప్పడు సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. అయితే, ఒకరు కోలుకొని వెళ్లడంతో మరొకరు సైతం బయపడతారని అందరూ భావించారు. చివరకు ఆమె చనిపోవడంతో ఇప్పుడు వ్యాధి వ్యాప్తిపై మళ్లీ ఆందోళన మొదలైంది. వైరస్ మనుషుల మధ్య సన్నిహిత సంబంధాల ద్వారా, ముఖ్యంగా శరీర ద్రవాల ద్వారా వ్యాపించే అవకాశం ఉంది. ఈ ఘటనతో థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్ వంటి ఆసియా దేశాలు కూడా స్క్రీనింగ్ చర్యలు పెంచాయి.
నిఫా వైరస్ అంటే..
ఇది జూనోటిక్ వైరస్. ఇది ప్రధానంగా గబ్బిలాలు, పందుల ద్వారా వ్యాపిస్తుంది. గబ్బిలాలు కొరికిన లేదా స్రవాలు వదిలిన పండ్లను తినడం వల్ల వస్తుంది. అలాగే పందుల వల్ల కూడా వ్యాపిస్తుంది. 1998లో మలేషియాలో పందుల ద్వారా భారీగా వ్యాప్తి చెంది, చాలా మందిని బలి తీసుకుంది. ఇది గబ్బిలాలు, పందుల నుంచి మనుషులకు సోకుతుంది. మనుషుల మధ్య వ్యాపిస్తుంది. ఇళ్లలో, ఆసుపత్రుల్లో సన్నిహిత సంబంధాల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. నిఫా (Nipah Virus).. 40 నుంచి 75 శాతం వరకు మరణాల రేటు కలిగిన ప్రమాదకర వైరస్. అయితే కోవిడ్ వంటి శ్వాసకోశ వైరస్‌లతో పోలిస్తే వ్యాప్తి తక్కువ.
వైరస్ బారినపడిన 4 నుంచి 21 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. మొదట జ్వరం, తలనొప్పి, దగ్గు వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. తరువాత తీవ్రమైన న్యుమోనియా లేదా మెదడు వాపు (ఎన్సెఫలైటిస్)కు దారితీస్తుంది. తీవ్ర కేసుల్లో కోమా, శ్వాసకోశ వైఫల్యం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ కేసుల్లో సగానికి పైగా మరణించే ప్రమాదం ఉంది. కొందరు కోలుకున్నా, కొన్నేళ్ల తర్వాత మళ్లీ లక్షణాలు రావచ్చు. ప్రస్తుతం నిఫా వైరస్‌కు టీకా లేదా యాంటీ వైరల్ ఔషధం లేదు.
Read Also: కులానికి బహిష్కరణ.. ఓ పల్లెటూరు ఆదర్శ తీర్మానం
Follow Us On: X(Twitter)


