ఢిల్లీ పేలుడు ఘటనపై విచారణ సంస్థలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసులో హరియాణాలోని అల్-ఫలాహ్ యూనివర్సిటీ(Al Falah University) ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే. నిందితుల్లో ఎక్కువ మంది డాక్టర్లు ఉండటం.. ఈ వర్సిటీకి సంబంధించిన వారు కావడంతో దర్యాప్తు సంఘాలు ఆ కోణంలో విచారిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం, దేశ రాజధాని ప్రాంతంలోని 25కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. యూనివర్సిటీ ఛైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దిఖీ(Javed Ahmed Siddiqui)ని అరెస్టు చేసింది.
ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీతోపాటు మరో ఇద్దరు వైద్యులు (డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షాహీన్ షాహిద్ అల్-ఫలాహ్ యూనివర్సిటీ(Al Falah University)లో పనిచేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ముగ్గురితో పాటు మరికొందరు వైద్యులు కూడా ఉగ్ర మాడ్యూల్‌లో భాగమని, జైష్-ఇ-మహ్మద్, అంసార్ ఘజ్వత్-ఉల్-హింద్ వంటి ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్‌లోని అద్దె గదుల్లో నుంచి సుమారు 2,900 కిలోల అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలు, ఆయుధాలను పోలీసులు సీజ్ చేశారు.
అయితే నిఘా వర్గాల సమాచారం ప్రకారం, యూనివర్సిటీకి చెందిన దాదాపు 10 మంది విద్యార్థులు, సిబ్బంది కనిపించకుండా పోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది. వీరిలో ముగ్గురు కశ్మీర్ వాసులు ఉన్నారు. మిస్సింగ్ అయిన వారి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. దీంతో ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్‌తో వీరికి సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హరియాణా డీజీపీ ఓపీ సింగ్ స్వయంగా క్యాంపస్‌ను సందర్శించి కనిపించకుండా పోయిన వారి ఆచూకీ గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈడీ తనిఖీల్లోనూ అనేక విషయాలు బయటపడ్డాయి. యూనివర్సిటీ తప్పుడు న్యాక్, యూజీసీ అక్రిడిటేషన్ చూపించి విద్యార్థుల నుంచి సుమారు రూ.415 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించింది. దీనిపై ఢిల్లీ పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో భారత విశ్వవిద్యాలయాల సంఘం అల్-ఫలాహ్ యూనివర్సిటీ సభ్యత్వాన్ని రద్దు చేసింది.
Read Also: మహిళల ఆస్తి హక్కుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Follow Us on: Youtube

