కలం, తెలంగాణ బ్యూరో : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ (BJP) వశమవుతుందా?.. సొంతంగా మేయర్ స్థానాన్ని కైవశం చేసుకోగలుగుతుందా?.. బీఆర్ఎస్ (BRS) మద్దతు తీసుకోవడం తప్పదా?.. ఈ రెండు పార్టీల మధ్య స్నేహం ఇక్కడి నుంచే చిగురిస్తుందా?.. అసెంబ్లీ ఎన్నికల వరకూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇలానే కంటిన్యూ అవుతుందా?.. ఇలాంటి చర్చలు స్థానికంగా మొదలయ్యాయి. రెండు పార్టీల శ్రేణుల్లోనూ ఇదే తరహా గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించినా సొంతంగా అవసరమైనంత మెజారిటీని పొందడం కష్టమేనన్నది బీజేపీ కేడర్ అనుమానం. ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా ఇదే తీరులో ఉన్నాయి. మేయర్ పీఠం కోసం పొత్తు కుదుర్చుకుంటాయా?.. లేక ఇది రాజకీయంగా భవిష్యత్తులో రెండు పార్టీలకూ తిప్పలు తెస్తుందా?.. ఇలాంటివి ఇప్పుడు కీలకంగా మారాయి.
కరీంనగర్ మేయర్ పీఠం ఏ పార్టీకి? :
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తికావడంతో ఇప్పుడు అందరి దృష్టీ కరీంనగర్ కార్పొరేషన్‌పైనే (Karimnagar Corporation) పడింది. ఇక్కడ ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం 66 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్‌లో మేయర్ పీఠాన్ని కైవశం చేసుకోవాలంటే 34 మంది కార్పొరేటర్ల బలం అవసరం. కానీ సర్వే సంస్థల అంచనా ప్రకారం అత్యధికంగా బీజేపీ పాతిక చోట్ల మాత్రమే గెలుస్తున్నది. ఆ తర్వాతి స్థానంలో 18 స్థానాలతో కాంగ్రెస్, 15 స్థానాలతో బీఆర్ఎస్, 7 స్థానాలతో మజ్లిస్, మరో చోట ఇండిపెండెంట్ గెలిచే అవకాశమున్నది. దీంతో పొత్తు ఉంటే తప్ప ఏ పార్టీ కూడా మేయర్ (Karimnagar Mayor) స్థానాన్ని కైవశం చేసుకోవడం సాధ్యం కాదు. ఏయే పార్టీల మధ్య ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకారం ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
బీజేపీ, బీఆర్ఎస్ దోస్తానా తప్పదా? :
కరీంనగర్ కార్పొరేషన్‌లో మేయర్ స్థానాన్ని కైవశం చేసుకోడానికి అన్ని పార్టీలూ మ్యాజిక్ ఫిగర్‌కు చాలా దూరంలోనే ఉండే అవకాశమున్నది. బీజేపీ, బీఆర్ఎస్ (BJP – BRS) పార్టీలు పరస్పరం సహకరించుకుంటే మాత్రమే మేయర్ అవకాశం దక్కుతుంది. ఏ పార్టీ డిమాండ్ ఎలా ఉంటుందన్నది కీలకం. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు అసాధ్యం.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య కూడా అసాధ్యం.. బీజేపీ, మజ్లిస్ మధ్య వీలే లేదు.. ఇలాంటి వాటన్నింటినీ స్థానికులు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా బీజేపీ, బీఆర్ఎస్ పరస్పరం సహకరించుకుంటే రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుందన్న అనుమానాలూ ఆ రెండు పార్టీలను వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లను బీజేపీ లాగేస్తుందా?.. లేక బీజేపీవైపు వెళ్ళేలా బీఆర్ఎస్ ప్రేక్షకపాత్ర వహిస్తుందా?.. క్యాంపు పాలిటిక్స్ మొదలవుతాయా?.. ఇలాంటి సందేహాలు నెలకొన్నాయి.
కాంగ్రెస్, మజ్లిస్ దోస్తీ ఓపెన్ సీక్రేట్ :
కాంగ్రెస్, మజ్లిస్ కలిసి మేయర్ పీఠాన్ని కైవశం చేసుకునే అవకాశాలు నెలకొంటే ఆ రెండు పార్టీల మధ్య దోస్తీ కారణంగా నల్లేరు మీద నడకే అవుతుంది. ఒకవేళ ఈ రెండూ కలిసినా తగినంతమంది కార్పొరేటర్లు లేని పరిస్థితి ఉత్పన్నమైతే బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్లే స్వచ్ఛందంగా క్యూ కడతారా?.. నగర అభివృద్ధి కోసం అధికార పార్టీకి దగ్గరవుతారా?.. లేక రాత్రికి రాత్రే పార్టీ మారి మద్దతు పలుకుతారా?… పదిమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అనుసరిస్తున్న ధోరణే కరీంనగర్ కార్పొరేషన్‌లోనూ కంటిన్యూ అవుతుందా?.. లేక ప్రలోభాలతో వారిని కాంగ్రెస్ లాగేస్తుందా?.. ఇలాంటి అవకాశాలూ లేకపోలేదు. బీజేపీకి కరీంనగర్ స్థానాన్ని దక్కకుండా చేయాలంటే కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. మేయర్ పీఠం కోసం ఏ పార్టీ ఎలాంటి ఎత్తులు వేస్తుందనేది ఆసక్తికరం.
Read Also: దొంగఓట్ల విషయంలో ఈసీ ఫెయిల్ : జగ్గారెడ్డి
Follow Us On: Sharechat


