కలం, వెబ్ డెస్క్ : నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ పట్టణంలో 12వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలింగ్ కొనసాగుతున్న సమయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగి, అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్(BRS) శ్రేణుల ఆరోపణల ప్రకారం, కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు ఆటోలకు పార్టీ స్టిక్కర్లు అతికించి ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్దకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే, పార్టీ కండువాలు ధరించి పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రచారం నిర్వహిస్తున్నారని కూడా ఆరోపించారు.
ఈ విషయంపై ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరు వర్గాల ఘర్షణ నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.


