కలం, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) బుధవారం ఢిల్లీ కి వెళ్ళనున్నారు. బేగంపేట నుంచి కొడంగల్‌కు హెలికాప్టర్‌లో వెళ్ళి అక్కడ ఓటు వేసిన అనంతరం తిరిగి హెలికాప్టర్‌లోనే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్తారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేంతవరకూ ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశమున్నది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు సమాచారం.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ సహా విపక్షాలు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన నేపథ్యంలో రాహుల్‌గాంధీ సహా పలువురు కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశమున్నది. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ ఈ నెల 3న సస్పెండ్ చేయగా అందులో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒకరు. సీఎం రేవంత్ వెంట ఆయన కూడా ఉండే అవకాశమున్నది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రాజెక్టుల ప్రస్తావన లేకపోవడం, నిధులను కేటాయించకపోవడం తదితర అంశాలపై వివిధ శాఖల మంత్రులను సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కలిసి చర్చించే అవకాశమున్నది.
రెండు రోజుల క్రితమే ఢిల్లీ వెళ్తారన్న వార్తలు వెలువడినప్పటీ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వెళ్లేలా షెడ్యూలు ఫిక్స్ అయింది. ఈ నెల 13న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్నందున అప్పటివరకూ ఢిల్లీలోనే సీఎం ఉండొచ్చని సమాచారం. కాంగ్రెస్ పెద్దలను కలిసిన సందర్భంగా పార్టీ సంస్థాగత వ్యవహారాలు చర్చకు వచ్చే అవకాశమున్నది. రాష్ట్ర బడ్జెట్ ఈ నెల చివరలో అసెంబ్లీలో టేబుల్ చేయాలని భావిస్తున్న తరుణంలో కొత్త స్కీమ్‌లు, వాటికి నిధుల గురించి అధిష్టానానికి వివరించే అవకాశమున్నది. సింగరేణికి చెందిన నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారం వివాదాస్పదమైన తర్వాత ఢిల్లీ వెళ్తున్నందున ఆ విషయం గురించి సీఎం వివరించే అవకాశమున్నది.


