కలం, వెబ్ డెస్క్: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) సంచలన నిర్ణయం తీసుకున్నారు. విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వ్యవహారం ముగిసేంత వరకు స్పీకర్‌గా ప్రొసీడింగ్స్ బాధ్యతలను చేపట్టనని తేల్చి చెప్పారు. స్పీకర్ చైర్లో కూర్చోబోనని డిసైడ్ అయ్యారు. ఒక సాధారణ సభ్యుడిగా మాత్రం సభకు హాజరుకానున్నారు. మనసు మారితే దానిపైనా మరో రకమైన నిర్ణయం తీసుకునే అవకాశమున్నది. విపక్షాల అవిశ్వాస తీర్మానంపై చర్చ సజావుగా జరగాలన్న అభిప్రాయంతోనే స్పీకర్ చైర్‌కు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. స్పీకర్ మీద ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాల్లో స్పీకర్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు ఇండియా కూటమిలోని పార్టీలతో రెండు రోజుల పాటు చర్చించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని తీర్మానాన్ని ఆ పార్టీలు చర్చించాయి. అనంతరం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. దీనికి అనుగుణంగా అన్ని కూటమి పార్టీల మద్దతుతో 118 మంది సభ్యులు సంతకాలు ఆ తీర్మానంపై సంతకాలు చేశారు. కాంగ్రెస్ చీఫ్ విప్ సురేశ్ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీల ప్రతినిధులు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసును లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అందజేశారు.
స్పీకర్ పదవిలో కొనసాగుతూ అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకోవడం వల్ల పారదర్శకత లోపిస్తుందన్న విమర్శలు వస్తున్న వేళ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలు, ప్రజాస్వామ్య విలువలను గౌరవించే భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా ఆయనే చెప్పారు. స్పీకర్‌గా ఆయన ప్రొసీడింగ్స్ కు దూరంగా ఉంటున్నందున సభా కార్యకలాపాలను ప్యానెల్ స్పీకర్లు నిర్వహించనున్నారు. సాధారణంగా స్పీకర్ లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ సభను నడిపించడం ఆనవాయితీ. కానీ ప్రస్తుతం లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనందున ప్యానెల్ స్పీకర్లే సభను నడిపించనున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై లోక్‌సభ సెక్రటేరియట్ స్పష్టత ఇవ్వనున్నది.
Read Also: ఆంథ్రోపిక్ కీలక ఉద్యోగి రాజీనామా.. టెక్ వరల్డ్‌లో కలకలం
Follow Us On: Sharechat


