epaper
Tuesday, November 18, 2025
epaper

ఓటమిపై ప్రశాంత్ కిశోర్ స్పందన ఇదే..

దేశంలోని ఎన్నో రాజకీయపార్టీలకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) తాను మాత్రం రాజకీయంగా దెబ్బతిన్నారు. మోడీ, జగన్, స్టాలిన్, మమత వంటి లీడర్లను తన వ్యూహాలతో విజయతీరాలకు తీసుకెళ్లిన పీకే.. సొంతపార్టీ స్థాపించి దారుణంగా విఫలమయ్యారు. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. కాగా ఈ ఓటమిపై తొలిసారి ప్రశాంత్ కిశోర్ స్పందించారు.

తాము ఎంత నిజాయితీగా శ్రమించినా, ఈసారి ప్రజల మద్దతు లభించలేదని అంగీకరించారు. ‘మేము ఓడిపోయాము.. కానీ బాధ్యత నుంచి పారిపోము. తప్పిదాలు ఎక్కడ జరిగాయో తెలుసుకుని, తిరిగి మరింత బలంగా వస్తాము. వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదు’’ అని పీకే తెలిపారు.

‘ప‌రాజ‌యానికి 100% బాధ్యత నాదే

ఈ ఓటమికి నేను పూర్తిగా బాధ్యత వహిస్తున్నాను. ప్రజల్లో మార్పు కోసం చేసిన ప్రయాణం మొదటి దశలో ఇలాంటి వెనుకడుగు తప్పక ఎదురవుతుంది’’ అని PK అన్నారు. అధికార కూటమి ఎన్నికల తీరు, డబ్బు ప్రభావం, కుల, మతాల ఆధారంగా ఓట్లను విభజించారని ఆరోపించారు. జన్‌ సురాజ్‌ పార్టీ(Jan Suraaj Party) ఈ ఎన్నికల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగింది. 238 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను రంగంలోకి దించింది. కానీ ఫలితాలు పూర్తిగా నిరాశ పరిచాయి. ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. మొత్తం ఓట్లలో పార్టీకి వచ్చిన వంతు 3.44 శాతం మాత్రమే. రాష్ట్రంలో 68 నియోజకవర్గాల్లో జన్‌ సురాజ్‌ అభ్యర్థులకు నోటా కంటే కూడా తక్కువ ఓట్లు రావడం పార్టీకి తీవ్ర వెనుకడుగైంది. అంతేకాదు, మొత్తం 238 మందిలో 236 మంది అభ్యర్థులు డిపాజిట్‌ కోల్పోవడం పీకేకు పెద్ద షాక్‌గా మారింది.

ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ పీకే(Prashant Kishor) చేసిన మరో వ్యాఖ్య రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. ‘ఎన్నికలకు ముందు ప్రతి నియోజకవర్గంలో 60 వేల మందికి ప్రభుత్వం రూ.10 వేల చొప్పున ఇవ్వకపోతే, నీతీశ్‌ కుమార్‌ పార్టీ 25 సీట్లకే పడిపోయేది. పథకాలు, డబ్బు పంపిణీ ప్రభావం స్పష్టంగా పనిచేసింది’’ అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరిని ఎంచుకోవాలనుకుంటే వారినే ఎన్నుకుంటారని, ఓట్లు రాకపోవడం నేరం కాదని పేర్కొన్నారు.

‘మతం, డబ్బు ఆధారిత రాజకీయాలను నేను జీవితంలోనూ చేయను. ఇలాంటి రాజకీయాలతోనే బిహార్‌ను వెనక్కి లాగుతున్నారు’ అని ప్రశాంత్‌ కిశోర్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు.  జన్‌ సురాజ్‌ పార్టీ భవిష్యత్తుపై మాట్లాడుతూ ‘ఈ ఓటమి మా ఉద్యమాన్ని ఆపదు. రాష్ట్రంలో వ్యవస్థాగత మార్పు కోసం మా కృషి కొనసాగుతుంది. ప్రజల ఆశలు తెలుసుకోవడానికి చేసిన యాత్రలు వ్యర్థం కావు.’ అని పీకే స్పష్టం చేశారు.

Read Also: ప్రతిపక్ష నేత హోదాకు నో చెప్పిన తేజస్వీ యాదవ్.. కానీ !

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>