కలం డెస్క్ : పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla Project) స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టే అవకాశం లేకపోలేదని, ఇలాంటిదే జరిగితే తెలంగాణకు పలు రకాలుగా నష్టం వాటిల్లుతుందని, అలాంటి చర్యలను అనుమతించవద్దని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు రాష్ట్ర సాగునీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) విజ్ఞప్తి చేశారు. బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ (DPR) తయారీ కోసం గతంలో పిలిచిన టెండర్లను ఏపీ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసినా మరో రూపంలో ఇంకో ప్రాజెక్టుకు అంకురార్పణ చేసే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. గోదావరి వరద జలాలను తరలిస్తున్నామనే సాకుతో ఏపీ కొత్త ప్రాజెక్టుకు తెర లేపితే ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర సైతం కృష్ణా జలాల్లో వాటా కావాలని డిమాండ్ చేస్తాయని, దిగువన ఉన్న తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రితో మంగళవారం ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు పలు అంశాలను వివరించారు.
తెలంగాణ పరిధిలో కృష్ణా, గోదావరి బేసిన్‌లోని పలు ప్రాజెక్టులకు సుదీర్ఘకాలంగా అనుమతులు రాకుండా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే తగిన పర్మిషన్స్ ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ రెండు నదుల జలాల్లో తెలంగాణకు ఉన్న హక్కులను పరిరక్షించాలని నొక్కిచెప్పారు. ఇది నెరవేరాలంటే పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయడం తక్షణావసరం అని అన్నారు. ఈ ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తి కావాలంటే ఆర్థిక వనరులను కూడా అవసరమని, వివిధ కేంద్ర పథకాల ద్వారా నిధులను సమకూర్చాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్ర జల సంఘానికి సమర్పించామని, 90 టీఎంసీల నీటి కేటాయింపులుగాను ఫస్ట్ ఫేజ్‌లో మైనర్ ఇరిగేషన్ కేటాయింపుల కింద 45 టీఎంసీలకు అనుమతులు ఇవ్వాలన్నారు.
సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇచ్చినందున వెంటనే అనుమతులు ఇవ్వాలన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీపై ట్రిబ్యునల్‌లో విచారణ తొందరగా పూర్తయ్యేలా కేంద్రం చొరవ తీసుకోవాలన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు విషయంలో ఎత్తును పెంచవద్దని సుప్రీంకోర్టు గతంలో చెప్పినా, స్టే ఉత్తర్వులు జారీ చేసినా వాటిని బేఖాతర్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం 524.5 మీటర్లకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నదని మంత్రి ఉత్తమ్(Uttam Kumar Reddy) ఆందోళన వ్యక్తం చేసి ఆ రాష్ట్రాన్ని కట్టడి చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.
Read Also: మావోయిస్టులకు ‘బండి’ డెడ్‌లైన్
Follow Us on : Pinterest

