కలం, వెబ్‌డెస్క్: పారా హుషార్. షాపుల్లో ట్యాబ్లెట్స్ కొనేటప్పుడు జాగ్రత్త. అసలైనవి ఏవో, నకిలీ ఏవో జాగ్రత్తగా పరిశీలించి తీసుకోండి. ఎందుకంటే ప్రాణాలతో చెలగాటమాడే మోసగాళ్లు నకిలీ ట్యాబ్లెట్స్ను మార్కెట్లోకి వదులుతున్నారు. గమనించకుండా వీటిని కొని, వాడితే ఉన్న రోగాలు పోవడం కాదు, కొత్తవి వస్తాయి. ఇలాంటి నకిలీ ట్యాబ్లెట్స్ వ్యవహారం ఒకటి ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు బయటపెట్టారు. భారీ స్థాయిలో నకిలీ లివ్.52 (Himalaya Liv 52) మాత్రలు తయారుచేస్తున్న ఓ ముఠాను అరెస్ట్ చేశారు.
వివరాలివీ.. తాము తయారుచేసే ‘లివ్.52’ ట్యాబ్లెట్స్కు నకిలీవి తయారుచేసి మార్కెట్లో కొందరు అమ్ముతున్నారంటూ ప్రముఖ ఆయుర్వేద మందుల తయారీ సంస్థ హిమాలయ జనవరి 3న ఘజియాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మురాద్‌నగర్ నుంచి సరఫరా చేస్తూ, అలీగఢ్‌లోని స్థానిక దుకాణాల్లో విక్రయిస్తున్నారని అందులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ నకిలీ ట్యాబ్లెట్ల వ్యవహారం భారీ స్థాయిలో కొనసాగుతున్నట్లు గుర్తించారు. ఈ నకిలీ ట్యాబ్లెట్స్ను హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో అమ్ముతున్నట్లు ఆధారాలు సేకరించారు. అనంతరం వాటి తయారీ ముఠాను సోమవారం అరెస్ట్ చేశారు.
ఒక్కో బాక్స్ నకిలీ ట్యాబ్లెట్ల తయారీకి రూ.35 నుంచి రూ.40 వరకు ఖర్చు అవుతుండగా, వాటిని రూ.110 నుంచి రూ.115 వరకు మార్కెట్లో ఈ ముఠా అమ్ముతోంది. అదే అసలైన హిమాలయ లివ్.52 (Himalaya Liv 52) ట్యాబ్లెట్స్ బాక్స్ ధర మార్కెట్లో రూ.280 ఉందని పోలీసులు తెలిపారు. అధిక లాభాల ఆశ చూపి, స్థాని రిటైల్ మందుల దుకాణాలను నిందితులు తమ బుట్టలో వేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో సుమారు 50వేల నకిలీ మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనిపై ఘజియాబాద్ డీసీపీ తివారీ మాట్లాడుతూ దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్లు చెప్పారు.
లివ్ 52 ట్యాబ్లెట్ ఎందుకు వాడతారంటే..
కాలేయం రక్షణకు ఈ ట్యాబ్లెట్ వాడతారు. ముఖ్యంగా కామెర్లు, ఫ్యాటీ లివర్, ఆల్కహాల్ వల్ల కలిగే కాలేయ సమస్యలకు, ఇతర కాలేయ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.
Read Also: డిజిటల్ అరెస్ట్ మోసాల్లో ఆ అధికారుల కుట్ర : సుప్రీం
Follow Us On: Instagram


