epaper
Wednesday, February 18, 2026
epaper

కేటీఆర్ వల్లే మున్సిపాలిటీల్లో సమస్యలు : సీఎం రేవంత్

కలం, డెస్క్ : కేటీఆర్ వల్లే మున్సిపాలిటీల్లో సమస్యలు పేరుకుపోయాయని.. ఎలాంటి అభివృద్ధి జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ‘బీఆర్ ఎస్ పదేళ్ల పాలనలో కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్ గా ఉండి ఏం చేశారు. ఎందుకు అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. ఇప్పుడు గెలిపిస్తే మళ్లీ అభివృద్ధి చేస్తామని కహానీలు చెబుతున్నారు. పదేళ్లుగా మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అన్ని వాళ్ల పార్టీవారికే దక్కాయి. మరి అభివృద్ధి ఏది’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

బీఆర్ ఎస్ నుంచి ఎవరు గెలిచినా కల్వకుంట్ల కుటుంబానికి బానిసలే అని.. అలాంటి పార్టీకి ఓటేసి మోసపోవద్దని సీఎం రేవంత్ (Revanth Reddy) చెప్పారు. ‘ఈ మున్సిపల్ ఎన్నికల్లో కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ సమాజం ఆమోదించదు. బరితెగించిన కోడి బజారులో గుడ్డు పెట్టినట్లు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తీరు ఉన్నది. పదేండ్లలో 20 లక్షల కోట్ల బడ్జెట్‌లో పేదలకు ఏం చేశారో చెప్పాలి. కేసీఆర్ ఇంట్లో ఏ బియ్యం తింటే ప్రజలకు అదే బియ్యం ఇస్తాం అన్నారు. కానీ ఇవ్వకుండా మోసం చేశారు. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి ఏనాడైనా అసెంబ్లీకి వచ్చారా. ప్రభుత్వం నుంచి అన్ని వసతులు పొందుతున్నారు గానీ.. ఆ బాధ్యతను నెరవేర్చట్లేదు.’ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

అసెంబ్లీలో సభను నడవకుండా చేయాలన్నదే బీఆర్ ఎస్ ఆరాటం అని.. ఏనాడైనా మున్సిపాలిటీల సమస్యలపై చర్చించారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘అలాంటి పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయి గెలిచింది బీర్ ఎస్ పార్టీ. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కనీస బాధ్యత లేకుండా కేటీఆర్, హరీష్‌ రావు మాట్లాడుతున్నారు. గంజాయి, కొకైన్ లాంటి డ్రగ్స్ తీసుకున్న వారిలాగా.. నిర్లక్ష్యంగా, బాధ్యతా రాహిత్యంగా కేటీఆర్, హరీష్‌ రావు మాటలు కనిపిస్తున్నాయి. వాళ్లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. పదేళ్లలో ఎన్నో స్కాములు చేశారు. చివరకు భార్య, భర్తలు మాట్లాడుకునేది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నారు. ఎంతో మంది వ్యాపారస్తులను బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు వసూలు చేశారు. ఇవన్నీ బీజేపీ నేతలే చెబుతున్నారు గానీ.. సీబీఐ విచారణ మాత్రం వేయట్లేదు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మరి సీబీఐ విచారణ ఎందుకు వేయట్లేదు. బీఆర్ ఎస్, బీజేపీ ఒక్కటే. ఆ రెండు పార్టీలు కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. వాటిని నమ్మొద్దు’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే..

బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు ఒక్కటే అని.. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీని కాపాడింది బీఆర్ ఎస్ పార్టీనే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ‘2022 వరకు బీజేపీ, బీఆర్ ఎస్ కలిసి పనిచేశాయి. బీజేపీ తీసుకొచ్చిన ప్రతి చట్టానికి బీఆర్ ఎస్ సపోర్ట్ ఇచ్చింది. రైతు వ్యతిరేక చట్టాలు, రాజ్యసభ ఎన్నికలు, నోట్ల రద్దు.. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మోడీకి కేసీఆర్ ఏనాడో మద్దతు తెలిపారు. మిషన్ భగీరథ విషయంలోనే కేసీఆర్, మోడీ దోస్తీ మొదలైంది. కానీ ఆ స్నేహాన్ని తెలంగాణ కోసం వాడుకోలేదు. కేసీఆర్ అవినీతిపై లేఖ రాస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఇప్పటి వరకు కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు వేయట్లేదు. ఇక్కడే వారి బంధం ఏంటో తేలిపోయింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కోసమే బీఆర్ ఎస్ పార్టీ పనిచేస్తోంది’ అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Read Also: కస్టోడియన్‌గా వ్యవహరించాలి… బ్యాంకులకు సుప్రీం ఆదేశం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>