కలం, వెబ్ డెస్క్ : వరల్డ్ కప్‌లో భాగంగా ఇంగ్లండ్ (England)తో జరిగిన పోరులో పసికూన నేపాల్ (Nepal)ఆట తీరు అందరినీ ఆకట్టుకుంది. భారత మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) నేపాల్ టీంపై ప్రశంసలు కురిపించాడు. ‘‘నేపాల్ అదరగొట్టింది. ప్రపంచంలోని బెస్ట్ టీమ్స్‌లో ఒకటైన ఇంగ్లండ్‌ను ధైర్యంగా ఎదుర్కొంది. చివరి బంతి వరకు పోరాడింది. నమ్మకం, గుండె ఉంటే ఏం చేయగలమో చూపించింది. జట్లు ఎదిగేది ఇలానే.. ఛాంపియన్స్ పుట్టుకొచ్చేది కూడా ఇలానే.. క్రికెట్ ప్రపంచం మొత్తం ఇప్పుడు నేపాల్ వైపు చూస్తోంది” అంటూ యువరాజ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు.
వాంఖడే వేదికగా (Wankhede Stadium) జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఫిల్ సాల్ట్ త్వరగా ఔటవ్వగా, జోస్ బట్లర్ 26 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ దశలో జేకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. బెతెల్ 55, బ్రూక్ 53 పరుగులతో కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. మధ్యలో దీపేంద్ర సింగ్ ఐరీ వికెట్లు తీసి ఒత్తిడి పెంచాడు. చివర్లో విల్ జాక్స్ వేగంగా పరుగులు చేసి ఇంగ్లండ్‌ను 184/7కు చేర్చాడు. లక్ష్య ఛేదనలో నేపాల్ ధైర్యంగా ఆరంభించింది.
కుశాల్ భుర్టెల్ వేగంగా పరుగులు సాధించాడు. లియామ్ డాసన్ స్పిన్‌తో కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్‌కు ఊపిరి పోశాడు. ఆపై రోహిత్ పౌడెల్ (Rohit Paudel), దీపేంద్ర సింగ్ ఐరీ (Dipendra Singh Airee) కలిసి ఇన్నింగ్స్‌ను మళ్లీ పోటీలోకి తెచ్చారు. ఈ జోడీ 82 పరుగుల భాగస్వామ్యంతో ఆశలు రేకెత్తించింది. చివరి ఓవర్లో 10 పరుగులు కావాల్సిన సమయంలో సామ్ కరన్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపుకు తిప్పాడు. నేపాల్ 180/6కే పరిమితమై కేవలం నాలుగు పరుగుల తేడాతో ఓడింది. ఫలితం ఏదైనా, నేపాల్ చూపిన ఆత్మవిశ్వాసం, పోరాట తత్వం ప్రశంసలు అందుకుంది.

Read Also: యూఎస్ఏ మ్యాచ్‌లో భారత్ ఆటపై గంగూలీ రియాక్షన్ ఇదే..!
Follow Us On: Sharechat


