దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(Rajamouli)కి రాష్ట్రీయ వానరసేన జలకిచ్చింది. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజమౌళి మతవిద్వేషాలను రగిల్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తన సినిమా పబ్లిసిటీ కోసం హిందూ దేవుళ్లపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది. హనుమంతుడిపై అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసి రాజమౌళి తన సినిమాకు పబ్లిసిటీ తెచ్చుకున్నారని ఆరోపించింది. హిందూ దేవుళ్ల పేర్లు వాడుకుని రూ.వేల కోట్లు అర్జిస్తున్న తెలుగు సినీ రంగ ప్రముఖులు ప్రత్యేక కార్యక్రమాల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేసి మతవిద్వేషాలకు దారితీస్తున్నారని విమర్శించింది. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన రాజమౌళిపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, లేదంటే వానర సేన(Rashtriya Vanar Sena) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హైదరాబాద్ సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అసలేం జరిగిందంటే..
రాజమౌళి(Rajamouli) ఆధ్వర్యంలో గ్రాండ్‌గా జరిగిన గ్లోబ్‌ట్రోటర్(Globetrotter) ఈవెంట్‌లో పలు సాంకేతిక లోపాలు వచ్చాయి. దీంతో ఈవెంట్ పలుమార్లు ఆలస్యం అవుతూ వచ్చింది. ఇది రాజమౌళికి తీవ్ర నిరాశ కలిగించింది. అయితే ఈ ఈవెంట్‌లో విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్ర కోసం మహేష్ ఎంతో కష్టపడ్డారు. కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు, కొన్ని సినిమాలు దేవతల చేత జరిగిపోతాయి” అని వ్యాఖ్యానించారు. అలాగే, “రాజమౌళి గుండెల్లో ఎప్పుడూ హనుమాన్ ఉంటాడు” అని కూడా చెప్పారు.
కానీ సాంకేతిక లోపాలతో విసిగెత్తిన రాజమౌళి.. “నాకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు. హనుమంతుడు నా వెనకాలుండి నడిపిస్తాడని నాన్న అంటారు. ఆ మాట వింటే నాకు కోపం వస్తుంది. నిజంగా ఆయన (హనుమంతుడు) ఉన్నాడంటే, ఇలా నడిపిస్తాడా? ఇన్ని అడ్డంకులు కలిగిస్తాడా” అని అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు హనుమంతుడి భక్తులకు, హిందూ భావాలకు అభ్యంతరకరంగా ఉన్నాయని భావించిన నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రాష్ట్రీయ వానరసేన వారు రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also: పటియాలా హౌస్‌కు బాంబు బెదిరింపు.. ఢిల్లీలో మళ్లీ హైఅలర్ట్
Follow Us on: Youtube

