కలం, వెబ్ డెస్క్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఉక్రెయిన్ (Ukraine)కు అండగా నిలవాలని అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ (Zelenskyy) పిలుపునిచ్చారు. ఎక్స్ వేదికగా ఆయన చేసిన పోస్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి దేశం తమ బలాన్ని, ఉక్రెయిన్‌కు ఎంత మేరకు సహాయ పడగలమనే సామర్థ్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని జెలెన్స్కీ అన్నారు. వాయు మార్గంలో జరిగే దాడులను ఎదుర్కొనే ఎయిర్ డిఫెన్స్ క్షిపణులు ప్రతిరోజూ తమకు అవసరమని స్పష్టం చేశారు. రష్యా నుంచి వస్తున్న బాలిస్టిక్ క్షిపణి దాడుల నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఆదివారం కూడా కూడా కీవ్ ప్రాంతంపై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు జరిగాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో దాడుల నడుమ ఏ దేశాన్ని ఒంటరిగా వదిలేయకూడదని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్న ప్రతి దేశానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే వారాల్లో భాగస్వామి దేశాలతో ఉక్రెయిన్ చర్చలు, సంప్రదింపులు జరుపుతుందని తెలిపారు. చర్చలు మంచి ఫలితాలు ఇవ్వాలని, ఆ ఫలితాలు కార్యరూపం దాల్చాల్సిన సమయం ఆసన్నమైందని జెలెన్స్కీ అన్నారు.


