epaper
Wednesday, February 18, 2026
epaper

మున్సిపోల్స్.. కుంభస్థలంపై కాంగ్రెస్ ఫోకస్

కలం, తెలంగాణ బ్యూరో : మున్సిపోల్స్ (Municipal Elections) మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఒకదానిని మించి మరొకటి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటున్నాయి. ఒకదానిపై మరొకటి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేండ్ల వైఫల్యాలతో ప్రజలు తమకే పట్టం కడతారని బీఆర్ఎస్ భావిస్తున్నది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలను కైవశం చేసకోవాలని ఉవ్విళ్లూరుతున్నది. అదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగురేయాలని హస్త పార్టీ నేతలు వ్యూహం పన్నారు. రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించినట్లే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓడించి ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ లేదని నిరూపించాలన్నది కాంగ్రెస్ ప్లాన్.

గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటపై కాంగ్రెస్ గురి :

కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట్, కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సిరిసిల్ల నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీల్లో ఒక్కటైనా గెలవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఆ పార్టీ ప్రభావం తగ్గిపోతున్నదనే మెసేజ్‌ను జనంలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నది. ఇందుకు ఆ నియోజకవర్గాల్లో వారిపై ఉన్న వ్యతిరేకతను గమనిస్తూ ఉన్నది. తదనుగుణంగా అక్కడి కాంగ్రెస్ లోకల్ లీడర్లకు పీసీసీ ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉన్నది. ఈ ముగ్గురూ ఆ పార్టీలో నెంబర్ వన్, టు, త్రీ గా ఉన్నందున వారి పరిధిలోని మున్సిపాలిటీల చైర్‌పర్సన్ పోస్టుల్ని గెల్చుకోవడం ద్వారా ఆ పార్టీకి షాక్ ఇవ్వాలనుకుంటున్నది. హరీశ్‌రావు ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న సమయంలో మల్లన్నసాగర్ రిజర్వాయర్ (Mallanna Sagar) నిర్వాసితులు ఆయనను నిలదీశారు. భూములు తీసుకుని నష్టపరిహారం చెల్లించలేదని ప్రశ్నించారు.

సిరిసిల్లలో సైతం కేటీఆర్‌కు చేదు అనుభవం :

సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో కేటీఆర్ ఇటీవల పర్యటించారు. సిరిసిల్లలోని 12, 15వ నెంబర్ వార్డుల్లో పర్యటిస్తున్న కేటీఆర్‌ను ‘నేతన్నలకు చేయూత’ పథకం నిధులను అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. కంచుకోటగా భావించే సిరిసిల్లలో మహిళలు, స్థానిక ప్రజలు ఇలా నిలదీస్తారని కేటీఆర్ ఊహించలేకపోయారని లోకల్ పార్టీ లీడర్లు వ్యాఖ్యానించారు. ఆయన ప్రశాంతంగానే స్పందించి సమాధానం చెప్పినా ప్రజలు కన్విన్స్ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేండ్లయినా మహిళలకు హామీ ఇచ్చిన తులం బంగారం గురించి ఆ పార్టీ నేతలను నిలదీయాలని కోరారు. ఒకప్పుడు చెప్పును నిలబెట్టినా గెలుపు ఖాయం అంటూ బీఆర్ఎస్ కామెంట్లు చేస్తే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సమయంలో నెంబర్ టూ అంటూ గుర్తింపు పొందిన కేటీఆర్‌ను ముఖం మీదనే నిలదీయడం రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది చర్చకు దారితీసింది.

హరీశ్‌రావుకు సైతం తప్పని తిప్పలు :

ట్రబుల్ షూటర్‌గా పార్టీలో గుర్తింపు పొందిన హరీశ్‌రావుకు సైతం ప్రజల నుంచి నిరసనలు తప్పలేదు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ ప్రచారం కోసం వెళ్ళిన హరీశ్‌రావును స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీశారు. ఆ తర్వాత నర్సాపూర్ మున్సిపాలిటీలో ప్రచారం చేస్తుండగా స్థానిక నిరుద్యోగులు నిలదీశారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారంటూ ప్రశ్నించారు. పదేండ్ల పాలనలో మున్సిపాలిటీలోని అనేక కనీస మౌలిక సౌకర్యాలను కూడా అభివృద్ధి చేయలేకపోయారని నిందించారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో సైతం వార్డుల విభజన అడ్డగోలుగా జరిగిందని, సమస్యలకు పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరగడానికి ఇబ్బందులు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ మున్సిపాలిటీ ప్రచారానికి వెళ్ళినప్పుడు మల్లన్నసాగర్ నిర్వాసితులు నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను చూసిన తర్వాత సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరేసి సత్తా చాటాలని హస్తం నేతలు పకడ్బందీ వ్యూహాన్ని రచించారు.

Read Also: మున్సిపోల్స్ రిజల్ట్.. కేటీఆర్‌కు ‘ఇజ్జత్ కా సవాల్’

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>