ఢిల్లీ ఎర్రకోట పేలుడు(Red Fort blast) కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురిని ఇటీవల అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ తాజాగా వారిని విడుదల చేసింది. మూడు రోజుల పాటు తీవ్ర విచారణ జరిపిన ఎన్ఐఏ ఈ నలుగురు వ్యక్తులకు కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ(Umar Un Nabi)తో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవని నిర్ధారించినట్టు సమాచారం.
హర్యానాలోని నుహ్ ప్రాంతానికి చెందిన ముగ్గురు వైద్యులు రేహాన్, మహమ్మద్, ముస్తకీమ్‌తో పాటు ఫర్టిలైజర్ వ్యాపారి దినేశ్ సింగ్లాను ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నది. ఈ కేసులో నిందితుడు ఉమర్ ఉన్ నబీతో సంబంధాలున్నాయనే అనుమానంతో విచారణ సాగింది. అయితే, డిజిటల్ ట్రేసింగ్, కాల్ డేటా రికార్డులు, ఆన్‌లైన్ కమ్యూనికేషన్ వంటి అంశాల్లో పరిశీలన చేసినప్పటికీ, వీరిలో ఎవరితోనూ ఉమర్ మధ్య ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధాలు ఉన్నట్లు నిర్ధారించే ఆధారాలు లభించలేదని ఎన్ఐఏ అధికారులు స్పష్టం చేశారు.
అంతేకాకుండా, ఎక్స్‌ప్లోసివ్ పదార్థాల కొనుగోలు, అనుమానాస్పద లావాదేవీలు వంటి కోణాల్లోనూ విచారణ సాగించింది. అయితే సరైన సాక్ష్యాలు లభించలేదని ఎన్ఐఏ పేర్కొంది. దీనితో వారిని విడుదల చేసినట్లు సమాచారం. విచారణ పూర్తిగా ముగిసిపోలేదని.. వారిపై పర్యవేక్షణ కొనసాగుతుందని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. మరోవైపు, ప్రధాన నిందితుడు ఉమర్ ఉన్ నబీ అంతర్జాతీయ నెట్‌వర్క్‌లతో సంబంధాలు ఉన్నట్లు తొలి దశలో బయటపడడంతో కేసు విచారణ మరింత విస్తృతంగా కొనసాగుతోంది. రెడ్‌ఫోర్ట్ పేలుడు(Red Fort blast) కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీంతో ఎన్ఐఏ చేపడుతున్న విచారణపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
Read Also: ఉపఎన్నిక ఫలితాలు ప్రభుత్వ వైఫల్యాలను చూపుతున్నాయ్: మాజీ సీఎం
Follow Us on : ShareChat

