epaper
Wednesday, February 18, 2026
epaper

బంగ్లాదేశ్​ జైలులో హిందూ లీడర్​, మాజీ ఎంపీ అనుమానాస్పద మృతి

కలం, వెబ్​డెస్క్​: బంగ్లాదేశ్​లో (Bangladesh) హిందువులపై దారుణాలు చల్లారడం లేదు. మహ్మద్​ యూనస్​ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా అధికారం చేపట్టినప్పటి నుంచి భారత వ్యతిరేక అల్లర్ల కారణంగా ఇప్పటివరకు ఏడుగురు హిందూ వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి కీలక హిందూ నేత, మాజీ ఎంపీ, మంత్రిగా కూడా పనిచేసిన 85 ఏళ్ల రమేశ్​ చంద్ర సేన్ (Ramesh Chandra Sen)​ చేరారు. బంగ్లాదేశ్​ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల కారణంగా దాదాపు ఏడాది నుంచి జైలులో ఉంటున్న ఆయన శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

దినాజ్​పూర్​ జిల్లా కారాగారంలో ఉన్న ఆయన అనారోగ్యం కారణంగా కాలుజారి కింద పడడంతో ఆస్పత్రికి తీసుకెళ్లామని, అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారని స్థానిక పోలీసులు అంటున్నారు. అయితే, దీనిపై బంగ్లాదేశ్​లోనే తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎంతో మంచివాడిగా, ఆపదల్లోనూ, అవసరాల్లోనూ ఆదుకునే వ్యక్తిగా పేరుపొందిన రమేశ్ చంద్ర సేన్​ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణవార్తను ఫేస్​బుక్​లో షేర్​ చేస్తూ ‘ప్రిజన్​ మర్డర్​’, ‘కస్టోడియల్​ డెత్​’ అంటూ తమ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన బంగ్లాదేశ్​లో హిందువులపై దాడులు ఆగడం లేదని మరోసారి ప్రపంచానికి చాటి చెబుతోందంటూ మహ్మద్​ యూనస్​ ప్రభుత్వంపై వాళ్లు మండిపడుతున్నారు.

అందరికీ సహాయం చేస్తూ..

రమేశ్​ చంద్ర సేన్ (Ramesh Chandra Sen)​ ఏప్రిల్​ 30, 1940‌‌న పుట్టారు. రంగపూర్​ కార్మికేల్​ కాలేజీలో బీఏ చదివారు. అందరికీ సహాయం చేస్తూ ఎంతో మంచివాడుగా పేరు తెచ్చుకున్నారు. ఠాకూర్​గావ్​–1కు ఎంపీ స్థానానికి 1997లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి మొదటి సారి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత మరో నాలుగుసార్లు ఎంపీగా విజయం సాధించారు. అవామీ లీగ్​ కేంద్ర కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. 2009 నుంచి 2014 వరకు షేక్​ హసీనా కేబినెట్​లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

2024లో జరిగిన ఆందోళనల కారణంగా షేక్​ హసీనా (Sheikh Hasina) పదవి కోల్పోయి భారత్​కు రాగా, అవామీ లీగ్​ నాయకులపై అనేక కేసులు నమోదయ్యాయి. అరెస్టు భయంతో చాలా మంది నేతలు దేశాన్ని విడిచిపెట్టి పారిపోయారు. అయితే, తాను ఎవరికీ శత్రువును కానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని ధీమాతో ఉన్న రమేశ్​ చంద్ర సేన్​ను బంగ్లాదేశ్​ పోలీసులు అక్రమంగా అరెస్ట్​ చేసి, జైలుకు పంపారు. ఇప్పుడు ఆయన మరణంతో బంగ్లాదేశ్​లో హిందువులపై దాడులు, మానవహక్కుల ఉల్లంఘనపై మరోసారి చర్చ జరుగుతోంది. వృద్ధుడైన రమేశ్​ చంద్ర సేన్​ చేతులను పోలీసులు తాళ్లతో కట్టి తీసుకెళ్లిన ఫొటో సోషల్​ మీడియాలో వైరలవుతోంది. దీన్ని చూసి మంచి మనిషిని, లీడర్​ను కోల్పోయామంటూ బంగ్లాదేశీయులు సైతం కన్నీరు పెడుతున్నారు.

Read Also: ఆర్​ఎస్​ఎస్​ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న సల్మాన్​ ఖాన్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>