epaper
Tuesday, November 18, 2025
epaper

ఢిల్లీలో సిద్దరామయ్య, డీకే.. సీఎం మార్పు ఉంటుందా?

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం నిత్యం చర్చకు వస్తూనే ఉంటుంది. బీహార్ ఎన్నికల అనంతరం మార్పు ఉండబోతున్నదని గతంలో ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు హైకమాండ్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరింది. తాజాగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. దీంతో మళ్లీ సీఎం మార్పు అంశం చర్చకు వచ్చింది. అయితే సీఎం సీటును వదులుకోవడానికి సిద్దరామయ్య ఏ మాత్రం సిద్ధంగా లేరని సమాచారం. డీకే మాత్రం తనకు గతంలో మాట ఇచ్చినట్టుగా పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ అంశం ఎటూ తెగడం లేదు.

తాజాగా సీఎం సిద్ధరామయ్య, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను కలిసి వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. పూర్తి కాలం సీఎంగా కొనసాగేందుకు అధిష్ఠానం సహకరించాలన్న ఆయన హైకమాండ్‌ను కోరారట. 2028 ఎన్నికల్లో డీకే శివకుమార్‌ను సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించాలన్న సూచన కూడా చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు డీకే శివకుమార్‌ మాత్రం అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటానని భావిస్తున్నట్లు తెలిసింది.

కర్ణాటకలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ త్వరలోనే జరిగే అవకాశాల నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah), కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భేటీ కానున్నారు. ఖర్గే నివాసంలో జరిగే ఈ సమావేశంలో క్యాబినెట్ విస్తరణ, కీలక పదవుల కేటాయింపు వంటి అంశాలు ప్రాధాన్యత సంతరించుకునే అవకాశముంది. డీకే శివకుమార్, ఖర్గేతో భేటీ కావడం కూడా ప్రాధాన్యం సంతరించుకున్నది. ‘పార్టీ వ్యవహారాలకే సంబంధించిన చర్చ మాత్రమే జరిగింది’ అని డీకే శివకుమార్ ఊహాగానాలను తోసిపుచ్చారు.

సీఎం పదవిని డీకే శివకుమార్‌కు అప్పగించినా, అప్పగించకపోయినా కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు తప్పవని బీజేపీ నేత ఆర్‌ అశోక్ వ్యాఖ్యానించారు. సిద్ధరామయ్య పదవిని వదులుకొనేందుకు సిద్ధంగా లేరని.. డీకే శివకుమార్ కూడా ఏం చేయాలో అర్థం కాక ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన ఆరోపించారు.

ఢిల్లీలో ఉన్న సీఎం సిద్ధరామయ్య త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. చెరకు రైతుల సమస్యలు, రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేంద్ర అనుమతులపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలు మళ్లీ తెరమీదకు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో జరుగుతున్న ఈ పర్యటనలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. మరి అధిష్ఠానం ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మార్పు అంశాన్ని తెరమీదకు తెస్తుందా? అన్నది అనుమానమే. ఇప్పటికే బీహార్‌లో మహాగట్ బంధన్ ఓటమితో కాంగ్రెస్ పార్టీ కాస్త ఇబ్బందుల్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కర్ణాటకలో ముఖ్యమంత్రిని మారిస్తే తేనెతుట్టెను కదిపినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఏ జరుగుతుందో వేచి చూడాలి.

Read Also: ‘డిజిటల్ అరెస్ట్’తో రూ. 31 కోట్లకు టోకరా

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>