కలం, వెబ్ డెస్క్: గోదావరి జలాలను వికారాబాద్ (Vikarabad) జిల్లాకు తీసుకొస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) హామీ ఇచ్చారు. కేసీఆర్ కాళేశ్వరం పేరుతో దోచుకున్నాడు తప్ప నీళ్లు తీసుకురాలేదని ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో అవినీతి చేశారని.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావు ఆస్తులు సంపాదించుకున్నారు తప్ప తెలంగాణ రైతులకు ఎటువంటి న్యాయం జరగలేదని విమర్శించారు. కేసీఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును కేసీఆర్ నిర్లక్ష్యం చేశాడని మండిపడ్డారు. తాము వెంటనే ఈ ప్రాజెక్టు కోసం భూ సేకరణ చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.
ఈ బ్యారేజీలతో ఉపయోగం ఏమిటి?
కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram) భాగంగా నిర్మించిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం, బ్యారేజీల వల్ల మంథని నియోజకవర్గానికి చుక్క నీరు రాలేదని రేవంత్ రెడ్డి (Revanth Reddy) మండిపడ్డారు. కాళేశ్వరం రెండేండ్లకే కూళేశ్వరం అయ్యిందని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ ఆస్తులు పెంచుకున్నారని.. టీవీలు, పేపర్లు పెట్టుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాంతాలకు జలాలను తీసుకొస్తామని చెప్పారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. దళిత బిడ్డను ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ దళితులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. దళితుడికి కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పీకర్ పదవి ఇచ్చామని గుర్తు చేశారు. మూసీ నది ప్రక్షాళనకు అనుమతులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డం పడుతున్నదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం సబర్మతి ప్రక్షాళన చేపట్టిందని కానీ తెలంగాణలో మూసీ ప్రక్షాళన చేపట్టకుండా ఎందుకు అడ్డం పడుతున్నారని ప్రశ్నించారు.
Read Also: బీజేపీ బీఫామ్‌లు బీఆర్ఎస్ ఆఫీసులో ఇస్తున్నారు : సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)


