కలం, ఖమ్మం బ్యూరో : పట్టణ పురపాలకాల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే మంచి సంకల్పంతో ప్రభుత్వం సగం స్థానాలు స్త్రీలకే కేటాయించి గౌరవిస్తోంది. కానీ పదవిలోకి వచ్చిన తర్వాత మహిళలు స్వేచ్ఛగా అధికారాలు చెలాయించే పరిస్థితి లేదన్న విషయం బహిరంగ రహస్యమే. పదవిలో ఉన్న మహిళ తరపున ఆమె భర్త, తండ్రి, కుమారుడు లేదా సోదరుడు రూపంలో ఉన్న ఈ నలుగురు వ్యక్తులు ఆమె స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంటారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారత (Women Empowerment) కోసం స్థానిక సంస్థలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాయి. ఈ రిజర్వేషన్లను స్థానికంగా బలంగా ఉన్న లీడర్లు వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఫలితంగా వారి భార్య, కూతురు, తల్లి లేదా సోదరిని రంగంలోకి దించి పోటీ చేయిస్తుంటారు. ఈ విధంగా మగువలను ఉత్సవ విగ్రహాలుగా చేసి మగ ఆధిపత్యం చూపిస్తుంటారు. ఈ ధోరణి పార్టీలకు అతీతంగా అన్నీ పార్టీల్లో కనిపిస్తుంటుంది. ప్రచారం దగ్గర నుంచి గెలిచినాక అభివృద్ధి మీటింగ్ లకు హాజరయ్యేంత వరకూ అన్ని విధుల్లో పురుషుల మార్క్ కనిపిస్తుంటుంది.
ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో, కొత్తగూడెం జిల్లాలోని ఒక కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలలో చాలా మంది నాయకులు ఈ జాబితాలో ఉన్నారు. వీరు సీటు సంపాదించే దగ్గర నుంచి సీటు కైవసం చేసుకునే వరకూ చాలా కీలకంగా వ్యవహరించడమే కాకుండా ప్రమాణస్వీకారం అనంతరం కూడా మహిళా సాధికారతకు భంగం కలిగిస్తూనే ఉంటారు. అందుకు నిదర్శనమే ప్రస్తుత మున్సిపాలిటీ ఎన్నికల్లో సీపీఏం పార్టీకి చెందిన ఒక మహిళ తన భర్త చెప్పాడని విత్ డ్రా చేసుకుని కాంగ్రెస్ పార్టీ సీటు ఏకగ్రీవం కావడంలో సహకరించారని, ఈ కారణంగానే ఆయన్ని పార్టీ సస్పెండ్ చేసిందనే ఆరోపణలు కూడా వచ్చాయి.
Read Also: గెలిస్తే పార్టీ మారొద్దు.. అభ్యర్థులతో బండి ప్రమాణం..!
Follow Us On : WhatsApp


