కలం, వెబ్ డెస్క్: భారత్-అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం(India US Interim Deal )పై వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్(Piyush Goyal )ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్–అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి రూపురేఖలు ఖరారయ్యాయని తెలిపారు. ఈ ఒప్పందం వల్ల భారత ఎగుమతిదారులకు 30 ట్రిలియన్ డాలర్ల విలువైన అమెరికా మార్కెట్ అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, రైతులు, మత్స్యకారులకు ఈ ఒప్పందం భారీ అవకాశాలు కల్పిస్తుందని గోయల్ అన్నారు. ఎగుమతులు పెరగడం వల్ల మహిళలు, యువతకు లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.
ఈ ఒప్పందం ప్రకారం, భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పరస్పర సుంకాలను 18 శాతానికి తగ్గించనుంది. దీంతో వస్త్రాలు, దుస్తులు, లెదర్, ఫుట్‌వేర్, ప్లాస్టిక్, రబ్బర్ ఉత్పత్తులు, ఆర్గానిక్ కెమికల్స్, హోమ్ డెకర్, హస్తకళ ఉత్పత్తులు, కొన్ని రకాల యంత్రాలకు అమెరికా మార్కెట్‌లో భారీ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అలాగే జనరిక్ ఔషధాలు, రత్నాలు, వజ్రాలు, విమాన భాగాలపై సుంకాలను పూర్తిగా సున్నాకి తగ్గించనున్నారు. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’కి మరింత బలం చేకూరుస్తుందని గోయల్ స్పష్టం చేశారు. విమాన భాగాలపై సెక్షన్ 232 కింద భారత్‌కు మినహాయింపులు, ఆటో పార్ట్స్‌పై టారిఫ్ రేట్ కోటా, జనరిక్ ఔషధాలపై అనుకూల ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. దీని వల్ల ఈ రంగాల్లో ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయని చెప్పారు.
అదే సమయంలో, రైతుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని గోయల్ తెలిపారు. మొక్కజొన్న, గోధుమలు, బియ్యం, సోయా, పౌల్ట్రీ, పాలు, చీజ్, ఎథనాల్, పొగాకు, కొన్ని కూరగాయలు, మాంసం వంటి సున్నితమైన వ్యవసాయ, డెయిరీ ఉత్పత్తులను పూర్తిగా రక్షించామన్నారు. ఈ తాత్కాలిక వాణిజ్య ఒప్పందం భారత్, అమెరికా మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని, ఇరు దేశాల ప్రజలు, వ్యాపారాలకు స్థిరమైన వృద్ధి తీసుకొస్తుందని పీయూష్ గోయల్ తెలిపారు.


