epaper
Wednesday, February 18, 2026
epaper

మరోసారి సిట్ ముందుకు కేటీఆర్, హరీశ్ ?

కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు చేస్తున్న సిట్ (SIT) రానున్న నాలుగు రోజుల్లో ఏం చేస్తుంది?.. మరికొందరికి నోటీసులిచ్చి విచారణకు పిలుస్తుందా?.. కేటీఆర్ (KTR), హరీశ్‌రావులకు (Harish Rao) మళ్లీ నోటీసులు ఇస్తుందా?.. వారిని ఎంక్వయిరీకి పిలుస్తుందా?.. పోలింగ్ దగ్గర పడుతున్నకొద్దీ సిట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది?.. ఇవీ ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తికరంగా మారాయి. గత నెల చివరి వారం నుంచి బీఆర్ఎస్ అగ్రనేతలు ఫోన్ ట్యాపింగ్ అంశం చుట్టే పరిమితమయ్యారు. మున్సిపోల్స్ పై దృష్టి పెట్టలేకపోయారు. ఇప్పుడు పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో మరోసారి సిట్ ముందు హాజరు కావాల్సి వస్తుందేమోననే సందేహాలు ఆ పార్టీ కేడర్‌ను వెంటాడుతున్నాయి. పోల్ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్ పెట్టలేని పరిస్థితులు తప్పవేమోనని ఆందోళన పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల రిజల్టును తలదన్నేలా మున్సిపల్ ఫలితాలు ఉంటాయన్న ధీమా కేడర్‌లో కనిపించడంలేదు.

బీఆర్ఎస్ ప్రచారంపై ఫోన్ ట్యాపింగ్ ఎఫెక్ట్ :

మున్సిపల్ ఎన్నికలను (Municipal Elections) బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరే పార్టీకంటే ముందే జిల్లా స్థాయి సమావేశాలను నిర్వహించింది. ఊహకు అందని తీరులో ఎలక్షన్ షెడ్యూలు రావడంతో అభ్యర్థులను ఫైనల్ చేయడంలో అన్ని పార్టీల్లాగే బీఆర్ఎస్ కూడా సతమతమైంది. అదే టైమ్‌లో కేసీఆర్ ఎంక్వయిరీ హాజరుకావాల్సి రావడంతో అగ్రనేతలు, రాష్ట్ర స్థాయి నాయకులంతా ఈ అంశం చుట్టూ తిరిగారు. దీంతో మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై ఎఫెక్టు పడింది. కేటీఆర్ (KTR) సిరిసిల్ల జిల్లాకు, హరీశ్‌రావు (Harish Rao) ఉమ్మడి మెదక్ జిల్లాకు మాత్రమే పరిమితమయ్యారు. కేసీఆర్ ఫామ్ హౌజ్‌లోనే ఉండిపోవడంతో ఆ పార్టీ తరఫున భారీ స్థాయి సభలు, సమావేశాలు, ప్రచారం లేక కేడర్‌లో అసంతృప్తి నెలకొన్నది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న టైమ్‌లో బీఆర్ఎస్ ఫోకస్ డైవర్ట్ అయ్యేలా సిట్ ఎలా వ్యవహరిస్తుందోననే అనుమానాలు కార్యకర్తలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

సీఎం రేవంత్ ట్రాప్‌లో బీఆర్ఎస్ :

సరిగ్గా మున్సిపల్ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ముమ్మరం కావడం బీఆర్ఎస్‌కు కష్టకాలాన్ని తీసుకొచ్చినట్లయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్, అమెరికా పర్యటనలో ఉన్నప్పటికీ సిట్ వ్యూహాన్ని బీఆర్ఎస్ పసిగట్టలేకపోయింది. ఆలస్యంగా తేరుకున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడింది. ఎంక్వయిరీకి హాజరు కావడం అనివార్యం కావడంతో మున్సిపల్ ఎన్నికల మీద దృష్టి కేంద్రీకరించలేకపోయింది. సీఎం రేవంత్‌రెడ్డి పక్కా వ్యూహంతో బీఆర్ఎస్‌ను ఉచ్చులోకి లాగి ఎలక్షన్ క్యాంపెయిన్‌పై ఫోకస్ పెట్టలేని పరిస్థితుల్ని సృష్టించారన్న టాక్ మొదలైంది. ఆ ట్రాప్‌లో ఇరుక్కుపోవడంతో ప్రచారంలో బీఆర్ఎస్ వెనకబడిందన్న చర్చలు ఊపందుకున్నాయి. అటు ఫోన్ ట్యాపింగ్ ఎంక్వయిరీని తప్పించుకోలేక ఇటు ఎలక్షన్ క్యాంపెయిన్‌పై దృష్టి పెట్టలేక బీఆర్ఎస్ నేతలు చిక్కుకుపోయారు.

ఈ నాలుగు రోజులే కీలకం :

మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈ నెల 9న ముగియనున్నది. ఆ తర్వాత పోల్ మేనేజ్‌మెంట్‌పై అన్ని పార్టీలూ దృష్టి పెట్టనున్నాయి. 11వ తేదీన జరిగే పోలింగ్ జరగనుండడంతో ఆ రోజున బీఆర్ఎస్ వ్యూహం తలకిందులయ్యేలా కాంగ్రెస్ ఎలాంటి పరిస్థితి తీసుకొస్తుందోననే అనుమానాలు నెలకొన్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఎంక్వయిరీ రూపంలో బీఆర్ఎస్‌ నేతలకు గడ్డు పరిస్థితులు వస్తాయా?.. మరో రూపంలో చిక్కులు ఎదురవుతాయా?.. సిట్ తదుపరి యాక్షన్ ప్లాన్ ఏ తీరులో ఉండబోతుంది?.. ఇలాంటి సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రచారం ముగియడం మొదలు పోలింగ్‌ కంప్లీట్ అయ్యేంత వరకు బీఆర్ఎస్‌కు ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్నది కీలకంగా మారింది. మూడు రోజుల క్రితం సిట్ హెడ్ సజ్జనార్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో తన టీమ్‌తో చేసిన రివ్యూ ఎత్తుగడలు ఎలా ఉంటాయన్నది అంతుచిక్కడం లేదు. ఈ నాలుగు రోజుల్లో జరగబోయే పరిణామాలేంటన్నది సస్పెన్స్.

Read Also: ఢిల్లీ చేరిన కవిత ఫైల్స్.. మూడు నెలల్లో కొలిక్కి…

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>