epaper
Wednesday, February 18, 2026
epaper

ఢిల్లీ చేరిన కవిత ఫైల్స్.. మూడు నెలల్లో కొలిక్కి…

కలం, తెలంగాణ బ్యూరో : కొత్త రాజకీయ పార్టీ (Political Party) ఏర్పాటు కోసం కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కసరత్తు ముమ్మరం చేశారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్‌లో (ECI) అప్లికేషన్ ప్రాసెస్ మొదలుపెట్టారు. పది రోజుల క్రితమే ఆమె తరఫున ఒక టీమ్ ఈసీ అధికారులను కలిసి చర్చించింది. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్లన్నింటినీ సిద్ధం చేసుకుని వారం రోజుల క్రితం సమర్పించింది. అన్ని రకాల ప్రొసీజర్‌లు పూర్తయ్యి ప్రజల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించి పార్టీ పేరును ఖరారు చేయడానికి మూడు లేదా నాలుగు నెలల పట్టే అవకాశమున్నది. ప్రస్తుతానికి నాలుగు పేర్లను ఆ అఫ్లికేషన్‌లో ప్రతిపాదించింది. అన్ని పేర్లలో తెలంగాణ (Telangana) తప్పనిసరిగా ఉండేలా కవిత జాగ్రత్తలు తీసుకున్నారు. ఉగాది తర్వాత పార్టీ పేరు ప్రకటిస్తానంటూ ఇటీవల మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ సందర్భంగా ప్రకటించినా మే నెల కావచ్చని జాగృతి వర్గాల సమాచారం.

పేరులో తెలంగాణ పదం సెంటిమెంట్ :

పార్టీ పేరులో తెలంగాణ పదం ఉండేలా ఆలోచించిన కవిత (Kavitha) నాలుగు పేర్లను ఎంపిక చేసుకున్నారు. ‘తెలంగాణ జాగృతి’ పార్టీ, ‘సామాజిక తెలంగాణ జాగృతి’ పార్టీ, ‘తెలంగాణ రాష్ట్ర జాగృతి’ పార్టీ, ‘జాగృతి తెలంగాణ’ పార్టీ అనే పేర్లను దరఖాస్తులో పొందుపర్చినట్లు జాగృతి వర్గాల ద్వారా తెలిసింది. కవిత ఇంటి పక్కనే తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడంతో ఆ అడ్రస్ మీదనే పార్టీ కోసం ఈసీకి అప్లికేషన్ పెట్టారు. పార్టీ పేరు ఖరారైన తర్వాత దాన్ని బహిరంగంగా ప్రకటించే సమయంలోనే పార్టీ నిబంధనావళి, దాని లక్ష్యం, నిర్మాణం తదితరాలన్నింటినీ వివరించనున్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తి, ప్రజా కోణం, అమరవీరుల త్యాగం తదితరాలన్నీ ‘పార్టీ రాజ్యాంగం’లో ఉంటాయని ఆ వర్గాలు తెలిపాయి. పార్టీ నిర్మాణంలో సైతం సోషల్ జస్టిస్, సెక్యులర్ స్పిరిట్ ఉంటుందని పేర్కొన్నాయి.

కేసీఆర్ చేసిన మిస్టేక్ చేయొద్దని… :

రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ (KCR) ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (TRS) పేరుతో 2001లో రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీలోని ‘తెలంగాణ’ పదమే ఆ పార్టీకి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దాని లక్ష్యాన్ని ప్రజలు సొంతం చేసుకున్నారు. పద్నాలుగేళ్ల స్ట్రగుల్ తర్వాత అధికారంలోకి వచ్చింది. తెలంగాణ పదానికి ఉన్న సెంటిమెంట్ బలం ఏ స్థాయిలో ఉందో రాష్ట్ర ప్రజలు అవగాహన చేసుకున్నారు. రెండో టర్ములో పార్టీ పేరు మార్పుపై జరిగిన కసరత్తు, ‘తెలంగాణ’ స్థానంలో ‘భారత్’ వచ్చి చేరడంతో ఎదురైన చిక్కులను సైతం కవిత గ్రహించారు. ‘భారత్ రాష్ట్ర సమితి’గా (BRS) మార్చడాన్ని అప్పట్లోనే వ్యతిరేకించినట్లు స్వయంగా ఆమె చెప్పుకున్నారు. ఇప్పుడు ఈ తరహా మిస్టేక్ చేయకుండా తెలంగాణ పదాన్ని కచ్చితంగా పార్టీ పేరులో ఉండేలా స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. బీఆర్ఎస్ చేసిన పొరపాటుకు దీటుగా ఆమె తన పార్టీ పేరులో ‘తెలంగాణ’ పదాన్ని పెట్టుకుని ప్రజలకు సూటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు.

Read Also: సందడి లేని సచివాలయం..

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>