ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘అన్నదాత సుఖీభవ(Annadata Sukhibhava)’ పథకంలో రెండో విడత నిధుల విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 19న కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడతలో ప్రతీ అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.5,000 జమ కానున్నాయి. రైతుల ఆర్థిక భారం తగ్గించడానికి, ముఖ్యంగా పంటల సాగులో తొలి పెట్టుబడికి తోడ్పడటానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. అదేరోజు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ పథకం(PM Kisan Scheme) కింద రైతులకు రూ.2,000 చొప్పున నిధులు విడుదల చేయనుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధులు ఒకేసారి రావడం వల్ల ఏపీ రైతుల ఖాతాల్లో మొత్తం రూ.7,000 జమ కాబోతున్నాయి.
46 లక్షల మందికి లబ్ధి
అన్నదాత సుఖీభవ(Annadata Sukhibhava) రెండో విడతలో 46 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అర్హులైన రైతుల వివరాలను బ్యాంకులకు పంపే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. డీబీటీ విధానంలో నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సిద్ధం చేశారు.
సీజన్‌కు ముందే ఉపశమనం
రాబోయే రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. విత్తనాలు, ఎరువులు, కూలీ ఖర్చులు వంటి ప్రారంభ వ్యయాలకు ఈ ఆర్థిక సాయం రైతులకు దోహదం చేయనుంది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు వ్యవసాయ రంగం పునరుద్ధరణకు, రైతుల ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.
Read Also: అయ్యప్ప భక్తులకు కేరళ సర్కార్ సూచన
Follow Us on : Pinterest

