బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆమె దోషిగా తేలారు. గత ఏడాది జులై, ఆగస్టు మధ్య జరిగిన విద్యార్థుల నిరసనల్లో 1,400 మంది మృతి చెందిన ఘటనలకు షేక్ హసీనా బాధ్యులని న్యాయస్థానం తేల్చింది. నిరసనకారులపై కాల్పులు జరపాలని, హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని ఆమె స్వయంగా ఆదేశించారన్న విషయం తీర్పులో ప్రస్తావించబడింది.
2024 ఆగస్టు 5న ఢాకాలో జరిగిన నిరసనలపై ఆర్మీ కాల్పులు జరపడం, గాయపడిన వారిని ఆసుపత్రులకు అనుమతించకపోవడం వంటి అంశాలపై కోర్టు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. నిరసనలను అణిచివేయడానికి ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకున్నదని కోర్టు అభిప్రాయపడింది. హసీనా అధికారంలో ఉండడానికే ఈ హింసను ప్రేరేపించారని ట్రైబ్యునల్ అభిప్రాయపడింది.
తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్(Bangladesh) రాజధాని ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు. నిరసనలు, హింసాత్మక ఘటనలు జరగకుండా ముందుగా చర్యలు తీసుకోవాలని, వాహనాలు తగలబెట్టే ప్రయత్నం చేసినా, బాంబులు విసిరినా కాల్చివేయాలని ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జత్ అలీ ఆదేశించారు. ఐసీటీ కోర్టు పరిసరాల్లో భారీ భద్రత మోహరించారు.
ఇప్పటికే భారత్‌లో ప్రవాసం
విద్యార్థుల ఆందోళనలతో ప్రభుత్వం కూలిన నేపథ్యంలో షేక్ హసీనా(Sheikh Hasina) గత ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ విడిచి భారత్‌కు రాగా, అప్పటి నుండి ఢిల్లీ లోని ఒక రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. తరచూ సోషల్ మీడియాలో సందేశాలు, ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.
హసీనా స్పందన ఇదే..
“వాళ్లు ఏ తీర్పు ఇచ్చినా నాకు సంబంధం లేదు. దేవుడు ఇచ్చిన ప్రాణం ఆయనే తీసుకుంటాడు. నా ప్రజల కోసం పనిచేయడమే నా ధర్మం. నా కుటుంబాన్ని, నా ఇంటిని ఈ దేశం కోసం కోల్పోయాను. గూండాలు, ఉగ్రవాదులు తీసుకువచ్చినదాన్ని విప్లవం అంటున్నారంటే నాకే ఆశ్చర్యం.” అంటూ హసీనా వ్యాఖ్యానించారు. తీర్పు ముందు ఆమె కుమారుడు కూడా “మా అమ్మకు మరణశిక్ష విధించవచ్చేమో” అని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: ఇమ్మడి రవి వద్ద 50 లక్షల మంది డాటా
Follow Us on : Facebook

