ఐబొమ్మ సైట్ క్రియేట్ చేసి అటు సినీ రంగానికి, పోలీసులకు అతిపెద్ద సవాల్‌గా మారిన ఇమ్మడి రవి(Immadi Ravi)ని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఇమ్మడి రవి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా కొందరు సినీ పెద్దలు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్(CP Sajjanar) తో భేటీ అయ్యారు. అనంతరం సజ్జనార్ ఈ కేసుకు సంబంధించిన పలు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇమ్మడి రవి వద్ద 50 లక్షల మంది డాటా ఉందని తెలిపారు. పైరసీ వల్ల సినీ రంగానికి భారీ నష్టం జరిగిందని తెలిపారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిపై ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ కింద మరో నాలుగు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అంతకుముందు పైరసీకి సంబంధించి ప్రశాంత్, శివరాజ్‌లను కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
ఇమ్మడి రవి 65 మిర్రర్ వెబ్‌సైట్లు నిర్వహించి, 21 వేల సినిమాలను పైరసీ చేసినట్లు తెలిపారు. 1972లో వచ్చిన గాడ్‌ఫాదర్ నుంచి ఇటీవలి ఓజీ వరకు అతడి హార్డ్‌డిస్క్‌లలో వేల సినిమాలు ఉన్నట్లు చెప్పారు. పైరసీ ద్వారా రూ.20 కోట్లు సంపాదించగా, అందులో రూ.3 కోట్లు ఇప్పటికే సీజ్ చేసినట్లు తెలిపారు. 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా రవి వద్ద ఉండటం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.
బెట్టింగ్ యాప్‌లను కూడా రవి ప్రమోట్ చేసినట్టు, వాటి వల్ల అనేక కుటుంబాలు నష్టపోయాయని సీపీ(CP Sajjanar) పేర్కొన్నారు. ఇమ్మడి రవి విశాఖకు చెందిన వ్యక్తి. బీఎస్సీ కంప్యూటర్స్ చదివినట్టు, నకిలీ పేర్లతో మహారాష్ట్రలో లైసెన్స్, పాన్ కార్డులు తీసుకున్నట్టు తెలిపారు. పోలీసులు అన్వేషణ ప్రారంభించగానే భారత పౌరసత్వం వదిలి, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వం పొందాడని వివరించారు.
2019లో ఐబొమ్మను ప్రారంభించిన రవి, అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్‌లో సర్వర్లు పెట్టి పనిచేసినట్టు తెలిపారు. మొత్తం 110 డొమెయిన్లు కొనుగోలు చేసి, ఒకటి బ్లాక్ అయితే వెంటనే మరొకటి తెరపైకి తెచ్చేవాడని చెప్పారు. ఈ రాకెట్‌లో ఉన్న మిగతా వ్యక్తులను కూడా గుర్తించి చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
Read Also: నటుడు బాలకృష్ణకు సీవీ ఆనంద్ సారీ..
Follow Us on: Instagram

