హైడ్రా(HYDRAA) అధికారులు మరోసారి భారీ కూల్చివేతలు చేపట్టారు. సోమవారం ఉదయం గచ్చిబౌలి(Gachibowli)లోని సంధ్య కన్వెన్షన్ సమీపంలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా అధికారులు ఈ కూల్చివేతలు చేపట్టారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో కొంతకాలంగా అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
లేఅవుట్‌లో అంతర్గత రహదారులను ఆక్రమించి, కొందరు వ్యక్తులు షెడ్లు, తాత్కాలిక గదులు, భవన నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అనేక మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో, చివరకు వారు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం, వెంటనే ఆక్రమణలను తొలగించాలని హైడ్రా అధికారులను ఆదేశించింది.
కోర్టు సూచనల మేరకు హైడ్రా(HYDRAA), జీహెచ్ఎంసీ, పోలీసులు ఆక్రమిత ప్రాంతానికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తర్వాత అధికారులు అక్రమంగా నిర్మించిన నాలుగు షెడ్లు, నిర్మాణ దశలో ఉన్న ఒక భవనాన్ని కూల్చివేశారు. కూల్చివేతలను చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలు పెరుగుతుండటంతో భవిష్యత్తులో లేఅవుట్ సదుపాయాలపై భారం పడుతుందని వారు చెప్పారు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చాయని, అదనంగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తక్షణమే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని హైడ్రా అధికారులు తెలిపారు.
Read Also: నటుడు బాలకృష్ణకు సీవీ ఆనంద్ సారీ..
Follow Us on : ShareChat

