కలం డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై సుప్రీంకోర్టు(Supreme Court) చీఫ్ జస్టిస్ బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయింపు చర్యలకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విషయంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మూడు నెలల వ్యవధిలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని తప్పుపట్టింది. కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడినట్లు వ్యాఖ్యానించింది. ఈ అంశంపై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసిన చీఫ్ జస్టిస్ బెంచ్… వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సంఘ్వికి స్పష్టం చేసింది. రెండు వార్లోగా నిర్ణయం తీసుకుంటారని ఆయన వివరణ ఇచ్చారు. ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేలపై నిబంధనల ప్రకారం వారిని అనర్హుల్ని చేసే విషయంలో స్పీకర్ హోదాలో నిర్ణయం తీసుకుంటారా?.. లేక సుప్రీంకోర్టే అలాంటి నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంటుందా?.. అని బెంచ్ వ్యాఖ్యానించింది.
కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడినందుకు వారం రోజుల్లోగా అనర్హతపై నిర్ణయం తీసుకుంటారో లేక కొత్త సంవత్సరం ఈవెంట్‌ను జైల్లో గడుపుతారో డిసైడ్ చేసుకోవాలని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. రోజువారీ విచారణ జరిపి ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు విషయంలో సుప్రీంకోర్టు(Supreme Court) గతంలో విధించిన డెడ్‌లైన్ ప్రకారం మూడు నెలల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అసెంబ్లీ స్పీకర్ కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని పేర్కొంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సోమవారం చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ పై వ్యాఖ్యలు చేశారు. నిర్దిష్ట గడువు లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కరణే అని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, ముకుల్ రోహతగీ వాదించారు.
Read Also: నటుడు బాలకృష్ణకు సీవీ ఆనంద్ సారీ..
Follow Us on: Youtube

